MP Komatireddy Venkat reddy News : మునుగోడులో మారుతున్న రాజకీయ పరిణామాల వేళ ఇవాళ కాంగ్రెస్ నిర్వహిస్తున్న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరుకావటంలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడాక.. నష్టనివారణ చర్యలు చేపట్టిన కాంగ్రెస్ నాయకత్వం చండూర్‌లో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తోంది. తన సోదరుడు పార్టీని వీడిన వేళ.. వెంకట్‌రెడ్డి నిర్ణయంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
MP Komatireddy Venkat reddy Latest News : రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన వెంటనే పీసీసీ అధ్యక్షుడు చేసిన విమర్శల పట్ల వెంకట్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తన నియోజకవర్గ పరిధిలోనే జరుగుతున్న సమావేశానికి ఆయన హాజరవుతారా.. అనే అంశం చర్చనీయంగా మారింది.
MP Komatireddy on Munugodu Congress Meeting : ఈ నేపథ్యంలో చండూర్‌లో జరుగుతున్న సమావేశానికి తాను ఈ భేటీకి దూరంగా ఉంటున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల కోసం గత కొన్ని రోజులుగా దిల్లీలోనే ఉంటున్న ఆయన.. ఫైనాన్స్ కమిటీ సమావేశం దృష్ట్యా హాజరుకాలేకపోతున్నట్లు వెల్లడించారు. మరోవైపు నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే దిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మునుగోడులో జరగనున్న కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యనేతలతో పాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు.
ఇప్పటికే తాను పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేసే వారికి లీగల్ నోటీసులు ఇస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం తదితర అంశాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. కోమటిరెడ్డి బ్రాండ్ లేదనడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో 35 ఏళ్లుగా పని చేస్తున్నానని, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని వెంకట్‌రెడ్డి తెలిపారు. తాను నాలుగు పార్టీలు మారి రాలేదన్నారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇంతకుముందే కోరానని చెప్పారు. సోనియా గాంధీ తనను పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారని తెలిపారు.
'నేను పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేసే వారికి లీగల్ నోటీసులు ఇస్తా. నేను నాలుగు పార్టీలు మారి కాంగ్రెస్‌కు రాలేదు. 35 ఏళ్లుగా కాంగ్రెస్‌లోనే పని చేస్తున్నా. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశా. సోనియా గాంధీ నన్ను పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారు.' - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ