హైదరాబాద్‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగసభకు కమలదళం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కి వెళ్లి జూలై 3న నిర్వహించే విజయ సంకల్ప సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభను కమలనాథులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీ జనసమీకరణకూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మట్లాడారు. తెలంగాణ ప్రజల మద్దతుతో సమావేశాలను విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
'జాతీయ కార్యవర్గ సమావేశాలకు 18 మంది సీఎంలు వస్తారు. పండుగ వాతావరణంలో సభలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అనేక అవరోధాలు కల్పిస్తోంది. తప్పుడు విషయాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల మద్దతుతో సమావేశాలను విజయవంతం చేస్తాం. దేశంలోని పేదల భవిష్యత్‌కు భరోసా కల్పించే దిశగా సమావేశాలు జరుగుతాయి.' - కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖమంత్రి
'మహారాష్ట్రలో పుత్ర వాత్సల్యంతో శివసేన కనుమరుగైంది. రాష్ట్రంలో తెరాస కూడా పుత్రవాత్సల్యంతో పతనమవుతుంది. తెలంగాణ ప్రజల మద్దతుతో సమావేశాలను విజయవంతం చేస్తాం.' - లక్ష్మణ్, భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు
విజయ సంకల్పసభకు రైళ్లు, బస్సులు.. విజయ సంకల్ప సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేయాలని కమలదళం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 16 రైళ్లు, భారీ సంఖ్యలో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు బుక్ చేసినట్లు సమాచారం. 10 లక్షల ఆహ్వానపత్రికలు ముద్రించిన పార్టీ గురువారం నుంచి వాటిని ప్రజలకు ఇచ్చి ఆహ్వానం పలకనుంది. ఒక్కో పోలింగ్ బూత్ నుంచి 30 మందిని తీసుకురావాలని లక్ష్యం నిర్దేశించిన భాజపా నాయకత్వం.. సంబంధిత బూత్ అధ్యక్షుడికే వారి ఆహార బాధ్యతల్ని అప్పగించింది.
ఇవీ చదవండి: