పార్లమెంటు ఎన్నికల తర్వాత కొంత స్తబ్దుగా ఉన్న సమాఖ్య కూటమి ప్రయత్నాలు మళ్లీ పుంజుకోనున్నాయి. ఎన్డీయేతర రాజకీయ పక్షాలను పునరేకీకరణకు కేసీఆర్ త్వరలో ప్రయత్నాలు మళ్లీ మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న తెరాస.... అదే అంశంతో అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. సీఏఏని వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. దేశంలో గుణాత్మక మార్పునకు శ్రీకారం చుట్టాలని మూడేళ్ల క్రితమే పేర్కొన్న కేసీఆర్... జాతీయ రాజకీయాల్లో చొరవను చూపారు.
ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోశించాలి: సీఎం
వ్యూహాత్మకంగా ముందుస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. ఘన విజయంతో తిరిగి అధికారంలోకి రావడంతో... ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేశారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో దేశంలోని ఎన్డీయే, యూపీయేతర పక్షాలను ఏకం చేసే దిశగా ముందుకెళ్లారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్, మమత బెనర్జీ, స్టాలిన్ ను కలిశారు. ఎన్డీయే, యూపీఏ రెండూ దేశానికి సమర్థవంతమైన నాయకత్వం ఇవ్వలేక పోయాయని... ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో మోడీ స్పష్టమైన ఆధిక్యత సాధించారు. ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు పెద్దగా కనిపించలేదు.
ఎన్డీయేతర కూటమిని ఏకం చేసే దిశగా...
సమాఖ్య కూటమి దిశగా కేసీఆర్ మళ్లీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పౌరసత్వ సవరణ చట్టం అంశంతో... ఎన్డీయేతర రాజకీయ పార్టీలను ఏకం చేసే దిశగా మరోసారి ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఏఏను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీలతో త్వరలో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే పలువురు సీఎంలు, పార్టీల అధినేతలతో చర్చించినట్లు చెప్పారు. అవసరమైతే దేశమంతా పర్యటిస్తానని చెప్పారు. అవసరమైతే కాంగ్రెస్‌తోనూ కలుస్తామని సంకేతాలు ఇచ్చారు. లక్ష్య సాధన కోసం బొంత పురుగునైనా ముద్దాడుతానని తెలంగాణ ఉద్యమంలో చెప్పానని... ఇప్పుడూ అదే విధంగా వ్యవహరిస్తామన్నారు.
కేంద్రం వల్లే వృద్ధిరేటు పడిపోయింది: కేసీఆర్
మోదీ సర్కారుపై గులాబీ పార్టీ అధినేత విమర్శలు కురిపించారు. కేంద్రం పనితీరు సరిగా లేదని.. దాని వల్ల రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది.. తెలంగాణలోనూ వృద్ధి రేటు పడిపోయిందని ఆరోపించారు. భాజపా మత చిచ్చు పెడుతోందని దుయ్యబట్టిన కేసీఆర్.. తెరాస నూటికి నూరు శాతం లౌకిక పార్టీ అని పునరుద్ఘాటించారు. పౌరసత్వ సవరణ చట్టం వంద శాతం తప్పేనని.. కేంద్రం పునర్‌సమీక్షించాలని డిమాండ్ చేశారు. సీఏఏకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. భాజపా జార్ఖండ్‌లో అధికారం కోల్పోయిందని.. దిల్లీలోనూ అరవింద్ కేజ్రీవాల్ హవా ఉందన్నారు. కేంద్రంలో 2024లో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రావిర్భావం తర్వాత ఎన్నికల్లో వరస విజయాలతో దూసుకెళ్తున్న గులాబీ పార్టీ... జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే దిశగా వ్యూహాత్మకంగా కదులుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచే ఫెడరల్ ఫ్రంట్ కు పదును పెట్టి.. రానున్న నాలుగేళ్లు... పక్కా ప్రణాళికతో వ్యవహరించేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్‌కు ఓటరు అవగాహన అవార్డు!