National Status For Upper Bhadra : కర్ణాటక చేపట్టిన అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా కల్పించింది. ఈ మేరకు అధికారికంగా సమాచారం ఇచ్చింది. అప్పర్‌భద్ర ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 2018-19 ధరల ప్రకారం రూ.16,125.48 కోట్లు కాగా, ఇందులో రూ.4,868.31 కోట్లను కర్ణాటక ప్రభుత్వం ఖర్చుచేసింది. మిగిలిన నిధులను జాతీయ హోదా కింద కేంద్రం భరించనుంది. దక్షిణాదిలో పోలవరం తర్వాత జాతీయ హోదా లభించిన ప్రాజెక్టు ఇదే. 2.25 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడంతోపాటు 367 చెరువులను నింపేందుకు అప్పర్‌భద్ర ప్రాజెక్టును కర్ణాటక చేపట్టింది. దీనివల్ల తుంగభద్రలోకి వచ్చే ప్రవాహం తగ్గిపోతుందని, ఈ ప్రభావం శ్రీశైలం ప్రాజెక్టు మీద, తెలుగు రాష్ట్రాలపైన పడుతుందని ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని తోసిపుచ్చిన కేంద్రం, కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-1 కేటాయింపుల మేరకే నీటి కేటాయింపులున్నట్లు పేర్కొంది.
Upper Bhadra Gets National Status : బచావత్ ట్రైబ్యునల్ కర్ణాటకకు కేటాయించిన 734 టీఎంసీలకు 2002లో బృహత్తర ప్రణాళిక(మాస్టర్ ప్లాన్) తయారు చేసిందని, ఇందులో తుంగభద్ర సబ్ బేసిన్‌కు ఉన్న కేటాయింపుల నుంచి అప్పర్‌భద్రకు 21.5 టీఎంసీలు కేటాయించిందని కేంద్రం తెలిపింది. తుంగభద్ర, వేదవతి సబ్ బేసిన్లలో చిన్ననీటి వనరులకు ఉన్న కేటాయింపుల నుంచి ఆరు టీఎంసీలను, పోలవరం ద్వారా కృష్ణాబేసిన్‌లోకి వచ్చే వాటాలో 2.4 టీఎంసీలు కలిపి మొత్తం 29 టీఎంసీలు అప్పర్‌భద్రకు వినియోగించుకోనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టును 2023-24వ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలన్నది లక్ష్యం.