విద్యుత్ విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ భాజాపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాసిన ఆయన.. విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వ సలహాదారు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు పెడర్థాలు తీస్తున్నారని మండిపడ్డారు.
పవన విద్యుత్ ఉత్పత్తిని 4వేల మెగావాట్ల నుంచి 40 వేల మెగావాట్లకు తగ్గించారు. రూ.11 చెల్లించి విద్యుత్ ఎందుకు కొన్నారో చెప్పలేకపోతున్నారు. పీపీఏల అంతర్జాతీయ ఒప్పందాలు రద్దు చేసుకోలేదని అజేయ కల్లాం చెప్పటం అసత్యం. విద్యుత్ విధానం సజావుగా ఉండాలన్న కేంద్రమంత్రి సూచనలపై విమర్శలు చేస్తారా? జపాన్, కొరియా, జర్మనీ, సింగపూర్ ఎంబసీలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన విషయం మర్చిపోయారా? సౌరవిద్యుత్, పవన్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం అన్ని రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. అలాగే విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ఎల్ఈడీ బల్బులు అందజేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుని అందరూ తప్పుబట్టారు. - కన్నా లక్ష్మీనారాయణ, ఏపీ భాజపా అధ్యక్షుడు.
విద్యుత్ పాలసీలు ఇష్టారాజ్యంగా మార్చాటానికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకమని కన్నా ఉద్ఘాటించారు. పీపీఏల రద్దు అంశం అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించిందని విమర్శించారు. విద్యుత్ నిర్వహణలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మహానది గనుల్లో రూ.1,600కే టన్ను బొగ్గు దొరుకుతుంటే రూ.3,710 చెల్లించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.
పర్యావరణ పరిరక్షణకు థర్మల్ విద్యుత్ కంటే సౌర, పవన్ విద్యుత్ మేలని చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తెలంగాణా నుంచి రావాల్సిన 5వేల 700కోట్ల విద్యుత్ బకాయిలు రాబట్టడంలో ప్రభుత్వం విఫలం. రివర్స్ టెండరింగ్ కారణంగా పోలవరం హైడల్ ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు. దీని ద్వారా 6వేల 193కోట్ల విలువైన 15వేల 484 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కోల్పోయాం. రివర్స్ టెండరింగ్లో 645 కోట్లు ఆదా చేశామని చెబుతున్న ప్రభుత్వం దీనికి ఏం సమాధానమిస్తుంది. కరోనాతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో విద్యుత్ ఛార్జీల భారం మోపారు"-కన్నా లక్ష్మీనారాయణ, ఏపీ భాజపా అధ్యక్షుడు.