జాతీయ స్థాయి అర్హత పరీక్ష(నీట్)లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల ర్యాంకులను (NEET Telangana ranks 2021) కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసింది. నీట్ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారీగా చేసిన నమోదు ఆధారంగా ఈ జాబితాను వర్సిటీ ప్రకటించింది. ఇది సమాచారం నిమిత్తమేనని, కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అభ్యర్థులు విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసిన తర్వాతే మెరిట్ జాబితాను విడుదల చేస్తామని వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి. తన పరిధిలోని వైద్య కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు విశ్వవిద్యాలయం మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అభ్యర్థుల దరఖాస్తుల ఆధారంగా ధ్రువపత్రాలను పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది.
మొదటి 10 ర్యాంకర్లు వీరే...
కొద్ది రోజుల క్రితం జాతీయ స్థాయి ర్యాంకులను ఎన్‌టీఏ విడుదల చేయగా వాటిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందజేసింది. ఆ జాబితా ఆధారంగా రాష్ట్రానికి (NEET Ranks in Telangana)చెందిన అభ్యర్థుల మొదటి 100 ర్యాంకులను వర్సిటీ ప్రకటించింది. రాష్ట్రంలో తొలి 10 ర్యాంకుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు చెరి సగం ఉన్నారు.
ఇతర ముఖ్యాంశాలు..
- మొదటి 100 ర్యాంకుల్లో అబ్బాయిలు 55 మంది, అమ్మాయిలు 45 మంది ఉన్నారు.
- జాతీయస్థాయిలో తొలి 100 ర్యాంకుల్లో 1, 16, 37, 42, 59, 72, 74, 79, 90, 99... ఇలా 10 ర్యాంకులు రాష్ట్ర విద్యార్థులవే. జాతీయ స్థాయిలో 2,486 ర్యాంకు పొందిన విద్యార్థి రాష్ట్రంలో 100వ స్థానంలో నిలిచారు.
- రాష్ట్ర స్థాయిలో తొలి 9 ర్యాంకులు జనరల్ కేటగిరీ విద్యార్థులే దక్కించుకున్నారు. పదో ర్యాంకు(జాతీయస్థాయి 99వ ర్యాంకు) బీసీ విద్యార్థి పొందారు.
- తొలి వంద ర్యాంకుల్లో 66 మంది జనరల్ కేటగిరీ విద్యార్థులు, 29 మంది బీసీలు, అయిదుగురు ఎస్‌సీలు ఉన్నారు.
ర్యాంకర్ల పేర్లు
1. మృణాల్ కుట్టేరి 2. ఖండపల్లి శశాంక్ 3. కాసా లహరి 4. ఈమని శ్రీనిజ 5. దాసిక శ్రీనిహారిక 6. పసుపునూరి శరణ్య 7.బొల్లినేని విశ్వాస్‌రావు 8.కన్నెకంటి లాస్య చౌదరి 9.గజ్జల సమైహనరెడ్డి 10.గాండ్ల ప్రమోద్‌కుమార్.
ఇవీచూడండి: