viveka murder case : ‘వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి నేను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు’ అని ఆ కేసులో అనుమానితుడిగా ఉన్న కల్లూరు గంగాధర్‌రెడ్డి తెలిపారు. అనంతపురంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సునీతను ఈ కేసు నుంచి బయటపడేయాలని జగదీశ్వర్‌రెడ్డి నన్ను ప్రలోభపెట్టాడు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డిపై తప్పుడు సాక్ష్యం చెప్పాలన్నాడు. నేను ఉంటున్న యాడికి గ్రామానికి వచ్చి రూ.20 వేలు డబ్బులిచ్చాడు. సీబీఐ దగ్గరకు వెళ్లి సాక్ష్యం చెబితే రూ.50 లక్షలు ఇస్తానన్నాడు. సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్ వద్దకు వెళ్లగా.. ఆయన కూడా తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. హత్య చేసినట్లు ఒప్పుకొంటే రూ.10 కోట్లు ఇస్తామని అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆఫర్ చేసినట్లు చెప్పాలని ఏఎస్పీ ఒత్తిడి తెచ్చారు. మేం చెప్పినట్లు చేస్తే జగదీశ్వర్‌రెడ్డి నీకు డబ్బులు ఇప్పిస్తారని ప్రలోభపెట్టారు’ అని తెలిపారు. తప్పుడు సాక్ష్యం చెబితే తనకు ఇబ్బంది అవుతుందని రామ్‌సింగ్‌కు చెప్పానన్నారు. వారం తర్వాత వచ్చి మాట్లాడతానని చెప్పినా.. తెల్ల కాగితం మీద సంతకం చేయించుకుని ఏఎస్పీ తనకు రూ.10వేలు ఇచ్చి పంపారని ఆరోపించారు. ఇప్పుడు తానే వాంగ్మూలం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయని గంగాధర్‌రెడ్డి విలేకర్లకు వివరించారు.
ఇదీ చదవండి: YS Viveka murder case : ' వైఎస్ వివేకా హత్యా నేరాన్ని నాపై వేసుకుంటే రూ.10కోట్లు'