జులై నెలాఖరు వరకు కాళేశ్వరం జలాలు బస్వాపూర్ జలాశయంలోకి చేరేలా పనుల పూర్తి కోసం రోజువారీ షెడ్యూల్ ఖరారు చేసినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నీటిపారుదల అంశాలపై హైదరాబాద్ జలసౌధలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీలు మురళీధర్, హరిరాం, సంబంధిత ఇంజినీర్లు సమావేశంలో పాల్గొన్నారు. ప్రాజెక్టులు, కాల్వల ఆధునీకరణ, నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకాలపై సమీక్షించారు.
చెరువులు, కాల్వలు, ఎత్తిపోతలు, చెక్ డ్యాంల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం జలాలు ప్రవహిస్తున్న 69, 70, 71 డిస్ట్రిబ్యూటరీలకు లైనింగ్ పనులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో వాటి కోసం మూడు రోజుల్లో అంచనాలు రూపొందించాలని చీఫ్ ఇంజినీర్లకు స్పష్టం చేశారు. సాగర్ ఎడమ కాల్వపై తలపెట్టిన 15 కొత్త ఎత్తిపోతల పథకాల డీపీఆర్, టెండర్లపై సమీక్షించిన మంత్రి.. జూన్ 15 నాటికి అంచనాలు ఇవ్వాలని, ఆ వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించినట్లు చెప్పారు.
ఎత్తిపోతలు ఏడాది కాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గడువు నిర్ధేశించినట్లు జగదీష్ రెడ్డి తెలిపారు. చెక్ డ్యాంలు, కాల్వలు, అన్నింటిని పూర్తి స్థాయిలో పరిశీలించి మరమ్మతులు చేయాలని, రైతులకు ఎక్కడా చిన్న ఆటంకం జరగకుండా చూడాలని మంత్రి ఇంజినీర్లకు స్పష్టం చేశారు.