Guinness world record: జ్ఞాపక శక్తి ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో ఉంటుంది. అదే ఈ యువకుడి దగ్గరకు వచ్చే వరకు ఆ స్థాయి అంతర్జాతీయ రికార్డ్ సాధించేలా ఉంది. అవును.. ఏపీలో కడపలోని రైల్వేకోడూరు కొత్త కృష్ణానగర్‌కు చెందిన కుర్రాడి పేరు గురు శంకర్. ఇతను ఇటీవలే తన అరుదైన జ్ఞాపకశక్తి ప్రతిభతో.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు సంపాదించాడు.
2.718281 నుంచి ఇన్ఫినిటీ వరకు గుర్తుపెట్టుకున్న యువకుడు
ఇతని రికార్డ్‌కు కారణం.. అత్యధిక యూలర్స్ నంబర్లను గుర్తుపెట్టుకోవడమే. అంటే.. 2.718281 నుంచి ఇన్ఫినిటీ వరకు. ఇలా 2 పాయింట్ తర్వాత వరుస క్రమంలో వచ్చే సంఖ్యల్లో.. గురు శంకర్ 7 వేల 777 అంకెలను గుర్తు పెట్టుకున్నాడు. గతంలో ఈ రికార్డు..5 వేల 5 స్థానాలు గుర్తు పెట్టుకున్న వ్యక్తి పేరుపై ఉండేది.
అత్యధిక డెసిమల్స్ గుర్తు పెట్టుకునేందుకు సాధన
చిన్నప్పటి నుంచి గణితంపై మంచి పట్టున్న గురు శంకర్‌కు.. యూలర్స్ నంబర్స్‌లోని అత్యధిక డెసిమల్స్ గుర్తు పెట్టుకునేందుకు కొన్ని నెలలుగా సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గురుశంకర్ తండ్రి శివయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఆయన జ్ఞాపకార్థం ఏదైనా సాధించాలని భావించిన ఈ కుర్రాడు.. గిన్నిస్ రికార్డ్‌తో సరైన నివాళులు అర్పించానంటున్నాడు. తన సాధనపై నమ్మకంతో..గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వెబ్‌సైట్‌లో పోటీకి నమోదు చేశాడు. ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో తన ప్రతిభను ప్రదర్శించి.. ఆధారాలను గిన్నిస్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. వాటిని పరిశీలించిన గిన్నిస్ ప్రతినిధులు.. గురు శంకర్ ప్రపంచ రికార్డ్ సాధించినట్లు తేల్చారు. ఈ విషయాన్ని తమ వెబ్‌సైట్ ద్వారా ప్రకటించారు. ప్రశంసా పత్రాన్ని అందించారు.
వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా..
చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండే గురు శంకర్.. ఈసీఈలో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. ఇలా.. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు మెమరీ టెక్నిక్స్ వంటి వాటిపై సాధన కొనసాగిస్తున్నాడు ఈ కుర్రాడు.
లక్ష్యాలను సాధిస్తూ..
గురు శంకర్‌కు సినీ పరిశ్రమలో ప్రవేశించాలని బలమైన కోరిక. అందుకు తగ్గట్టే..కథా రచయితగా, దర్శకుడిగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 4 కథలు రాసి.. సినీ పరిశ్రమలో కథా రచయితగా రైటర్ కార్డ్ కూడా పొందాడు.. ఈ యువ రచయిత. భిన్న అభిరుచులున్నా..అన్నింటిలో సమానంగా రాణిస్తున్న గురు శంకర్... తన లక్ష్యాలను ఒకదాని తర్వాత ఒకటి సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.
సినీ పరిశ్రమలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు
తన సాధన తాను చేసుకుంటున్న యువకుడు.. ఏకంగా ప్రపంచ రికార్డ్ సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. స్నేహితులు, బంధువులు.. గురు శంకర్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. జ్ఞాపక శక్తిలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న ఈ కుర్రాడు..ఇప్పుడు తన జీవిత గమ్యమైన సినీ పరిశ్రమలోను ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఇదీ చదవండి: