CPI NARAYANA NEWS: కోట్లాది మంది భక్తి శ్రద్ధలతో కొలిచే మేడారం సమ్మక్క సారక్క జాతరను అవమానించడం సరైన పద్ధతి కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని రావి నారాయణరెడ్డి కాలనీలో రాజ్‌గురు, భగత్‌సింగ్, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలపై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హాజరై మాట్లాడారు.
'లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సమ్మక్క సారక్కలు.. విప్లవ వీరులు వారిపై చిన్నజీయర్ స్వామి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి. యువత భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల ఆశయ సాధన కోసం కృషి చేయాలి. భగత్‌సింగ్ ఆశయాలకు విరుద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. డ్రగ్స్ మాఫియాని అంతం చేస్తామన్న ప్రధాని.. అదాని రూపంలో మాదకద్రవ్యాల సరఫరాను ప్రోత్సహిస్తున్నారు.'
-సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
యువత దేశ రాజకీయాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు. చెడు వ్యసనాలను ప్రోత్సహించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాలని సూచించారు.
ఇదీ చదవండి:NBW on BJP MP: భాజపా ఎంపీకి నాన్ బెయిలబుల్ వారెంట్.. ఎందుకంటే?