రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటల 50 నిమిషాలకు.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. హిమా కోహ్లితో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, న్యాయమూర్తులు హాజరు కానున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి బాధ్యతలు చేపట్టనున్నారు. దిల్లీలో 1959 సెప్టెంబరు 2న జన్మించిన హిమా కోహ్లి.. దిల్లీ యూనివర్సిటీలో లా కోర్సు పూర్తి చేశారు. 1984లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. దిల్లీ హైకోర్టులో 2006 నుంచి న్యాయమూర్తిగా ఉంటూ.. అనంతరం ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది తెలంగాణకు బదిలీ అయ్యారు. నూతన సీజే ప్రమాణస్వీకారం నేపథ్యంలో.. ఉదయం10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్‌భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఇవీ చూడండి: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి