Junior NTR condolences: నందమూరి తారకరామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కుటుంబాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు పరామర్శించారు. ఉమామహేశ్వరి చనిపోయిన సమయంలో కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం భార్య ప్రణీత, తల్లి శాలిని, సోదరుడు కళ్యాణ్ రామ్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని మేనత్త నివాసానికి వచ్చారు. ఉమామహేశ్వరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు కుటుంబసభ్యులతో మాట్లాడిన తారక్... తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వారికి ధైర్యం చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కుమార్తె అయిన కంఠమనేని ఉమామహేశ్వరి ఆగస్టు 1న హఠాన్మరణం చెందగా.. నిన్న(ఆగస్టు 3న) అంత్యక్రియలు జరిగాయి. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఉండగా.. ఆమె నిన్న తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ చేరుకున్న అనంతరం అంత్యక్రియలు జరిపారు.
నందమూరి కుటుంబంలో ఉమామహేశ్వరి మరణం తీవ్ర విషాదం నింపగా.. కుటుంబసభ్యులతో పాటు సినీప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆమె పార్థీవదేహానికి నివాళులర్పించారు. ఉమామహేశ్వరి మరణ వార్త వినగానే.. ఆమె సోదరులైన బాలకృష్ణ, రామకృష్ణతో పాటు తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, లోకేశ్, హీరో కల్యాణ్‌రామ్, నారా రోహిత్ ఇలా చాలా మంది కుటుంబసభ్యులు.. వెంటనే ఆమె నివాసానికి చేరుకున్నారు. మరికొంత మంది.. ఆగస్టు 2న చేరుకున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, బంధువులు.. ఆమె పార్థీవదేహానికి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవీ చూడండి: