Job Vacancies in Telangana : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో తొలుత జిల్లా స్థాయి పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దాంతోపాటే జోనల్, బహుళ జోనల్ ఖాళీలు నింపేందుకు కసరత్తు జరుగుతోంది. జిల్లా స్థాయిలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి పోలీసు నియామకాల ప్రకటన జారీకి సన్నాహాలు మొదలయ్యాయి.
Telangana Job Vacancies : ప్రభుత్వం మొత్తం పోస్టులను నాలుగు కేటగిరీలుగా విభజించగా.. అందులో అధిక శాతం జిల్లాలవే. కొత్త జిల్లాలతో పాటు పాతవాటిల్లోనూ కొత్త ఉద్యోగుల అవసరం ఉంది. జిల్లాస్థాయి ఖాళీలతో పాటు ఉద్యోగుల సంఖ్య (కేడర్ స్ట్రెంత్), సర్వీసు నిబంధనలు, రోస్టర్ తదితరాలపై స్పష్టత దృష్ట్యా నియామకాలు ముగిసిన తర్వాత కేటాయింపులు సత్వరమే పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జిల్లా కేడర్‌లోని జూనియర్ అసిస్టెంటు, జూనియర్ పంచాయతీ అధికారి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4, కానిస్టేబుల్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంటు, జూనియర్ స్టెనో, డ్రైవర్, రికార్డు అసిస్టెంటు, ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ వర్కర్, స్వీపర్, వాచ్‌మెన్ పోస్టుల సత్వర భర్తీ అవసరం ఏర్పడింది. కొత్త జోనల్ విధానం మేరకు ఉద్యోగుల బదలాయింపులు, బదిలీలు, పోస్టింగులు పూర్తయ్యాయి. బదిలీ అయిన వారు విధుల్లోనూ చేరారు.
Job Recruitment in Telangana : పాత జిల్లాలకు ప్రస్తుతం ఉన్న రోస్టర్ కొనసాగుతోంది. కొత్త జిల్లాలకు మొదటి నుంచి రోస్టర్ ప్రారంభమవుతుంది. దీంతో కొత్తగా నియామకాలు పూర్తయితే వెంటనే విధుల్లో చేరేందుకు వెసులుబాటు ఉంటుంది. జిల్లా స్థాయి నియామకాలను జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన గల ఎంపిక కమిటీ (డిస్ట్రిక్ట్స్ సెలెక్షన్ కమిటీ) ద్వారా జరపాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎంపిక అనంతరం కలెక్టర్ల ద్వారానే రోస్టర్ కేటాయింపులు, ఇతర ప్రక్రియలు సులభంగా జరుగుతాయని భావిస్తోంది. పోలీసుశాఖలోనూ జిల్లాస్థాయుల్లో కానిస్టేబుళ్లు, జోనల్ స్థాయిలో ఎస్సైల నియామకాలు జరుగుతాయి. ఇందులో కానిస్టేబుళ్లే అధిక శాతం మంది ఉన్నారు. స్థానిక కమిషనర్లు, ఎస్పీలు వారి కేటాయింపుల ప్రక్రియ చేపడతారు.