ఏ వస్తువైనా వాణిజ్యపరంగా విజయవంతం కావటంలో ప్యాకేజింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వినియోగదారులు ఒక వస్తువు ఏ సంస్థకు చెందిందో తెలుసుకుని, దాని కోసం ప్రయత్నించాలనుకోవడం వంటివి ప్యాకేజింగ్‌పైనే ఆధారపడివుంటుందన్నది
నిపుణుల మాట. బ్రాండ్ విలువను పెంచడంలోనూ, వినియోగదారుడి దృష్టిని ఆకర్షించడంలోనూ దీనిదే ప్రధాన పాత్ర. అందుకే మార్కెటింగ్ విజయం ప్యాకేజింగ్‌పై ఆధారపడి ఉంటుందని చెబుతారు. ఒక వస్తువుపై అంతగా ఆసక్తీ, అవసరమూ లేకపోయినా దాన్ని ఆకర్షించేలా అమర్చిన ప్యాకేజింగ్ కోసమే చాలామంది కొనుగోలు చేస్తారని సర్వేలు చెబుతున్నాయి. దీన్ని బట్టి వస్తు మార్కెట్‌లో దీని ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ కొనుగోళ్లు గత కొన్నేళ్లలో బాగా ఆదరణ పెంచుకున్నాయి. తాజాగా కొవిడ్ పరిణామాల కారణంగా ఏడాది కాలంలో ప్రతిదీ ఆన్‌లైన్ బాట పట్టింది. కొనుగోళ్లూ ఇందుకు మినహాయింపు కాదు. సామాజిక దూరం నేపథ్యంలో ఎక్కువమంది నిత్యావసరాలు సహా ప్రతి చిన్న వస్తువుకూ ఆన్‌లైన్‌పైనే ఆధారపడ్డారు. ఈ సమయంలో ఒక ప్రదేశం నుంచి జాగ్రత్తగా వస్తువులను వినియోగదారుడికి చేర్చడం కొంత ఇబ్బందే. కానీ ఈ సమయంలో వస్తువు చెక్కుచెదరకుండా చేర్చిన సంస్థలవైపే కస్టమర్ల మొగ్గు కనిపించింది. అంటే.. కేవలం అందానికే కాకుండా భద్రతకూ ఇక్కడ ప్రాధాన్యం!
అందుకే సంస్థలు ప్యాకేజింగ్‌పై ప్రత్యేక దృష్టిని పెడుతున్నాయి. చూడగానే ఆకట్టుకునేలా చేయడంతోపాటు నకిలీ వాటిని గుర్తించేలా హాలోగ్రామ్ వంటివీ ముద్రిస్తాయి. ప్రత్యేకాంశాలు, ఉపయోగించే విధానం, ఆహార సంబంధ వస్తువులైతే తయారీలో ఉపయోగించిన ముడిపదార్థాలతోపాటు కేలరీల వివరాలనూ అందిస్తున్నాయి. ఆహార పానీయాలు, కూరగాయలు, పండ్లు, ఔషధాల నుంచి ప్రమాదకర రసాయనాలు, వస్తువుల వరకు కొన్ని ప్రత్యేక టెక్నాలజీలను రవాణా కోసం ఉపయోగిస్తున్నారు.
ఉద్యోగావకాశాలు
ప్యాకేజింగ్ రంగానికి ఆదరణ పెరుగుతోంది. రంగం, ఉత్పత్తులతో సంబంధం లేకుండా ప్యాకేజింగ్ అవసరం ఉంటుంది. దీంతో నిపుణుల అవసరమూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 35,000కు పైగా ప్యాకేజింగ్ యూనిట్లు ఉన్నాయి. ఏటా మూడు వేలమందికి పైగా నిపుణుల అవసరం ఏర్పడుతోంది. కానీ అందుకు తగ్గ సిబ్బంది అందుబాటులో ఉండటం లేదనేది వివిధ అధ్యయన నివేదికల సారాంశం. దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ ప్యాకేజింగ్ నిపుణుల అవసరం పెరుగుతోంది.
మెటీరియల్ మేనేజ్‌మెంట్, స్టోర్స్, సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్, ఆర్ అండ్ డీ, ఫుడ్ ప్రాసెసింగ్, రోబోటిక్స్, ఫార్మాస్యూటికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్ మొదలైన వాటిల్లో వీరికి ప్రధాన అవకాశాలుంటాయి. సాధారణంగా వీరిని ప్యాకేజింగ్ ఇంజినీర్, డిజైనర్, కన్స్యూమర్ బిహేవియర్ అనలిస్ట్, ప్యాకేజింగ్ ఆపరేటర్, ప్యాకేజింగ్ టెక్నాలజిస్ట్, ప్యాకేజింగ్ డెవలప్‌మెంట్ మేనేజర్, రిసెర్చర్, ప్యాకేజింగ్ స్పెషలిస్ట్ మొదలైన హోదాలకు ఎంపికచేస్తారు.
ఐటీసీ లిమిటెడ్, నెస్లే, జీఎస్‌కే, రాన్‌బాక్సీ, హిందుస్థాన్ యూనీలీవర్, డాబర్ ఇండియా, క్యాడ్‌బరీ ఇండియా, కాస్టర్ ఇండియా, సన్ ఫార్మా, రెకిట్ బెంకిసర్ మొదలైనవి నియామకాలకు ఎంచుకుంటున్న కొన్ని ప్రముఖ సంస్థలు. . ప్రారంభవేతనం ఏడాదికి మూడు లక్షల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయలవరకూ ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ మంచి వేతనాలను అందుకోవచ్చు.
దరఖాస్తుల ఆహ్వానం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ).. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ప్యాకేజింగ్, దాని అనుబంధ పరిశ్రమల ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ. ప్యాకేజింగ్ ప్రమాణాలను దేశీయంగా అభివృద్ధి చేయడం ఈ సంస్థ ఉద్దేశం. ప్యాకేజింగ్‌కు సంబంధించి ఈ సంస్థ కొన్ని కోర్సులను అందజేస్తోంది. తాజాగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (పీజీడీపీ) కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. కోర్సు కాలవ్యవధి రెండేళ్లు.
అర్హత : గుర్తింపు పొందిన సంస్థ/ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసుండాలి. ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మ్యాథమేటిక్స్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీల్లో ఏదో ఒక సబ్జెక్టుగా చదివుండాలి. రెగ్యులర్ విధానంలో చదివినవారే దరఖాస్తుకు అర్హులు. డిగ్రీని 12+3 విధానంలో పూర్తిచేసుండటం తప్పనిసరి. అగ్రికల్చర్/ ఫుడ్‌సైన్స్/ పాలిమర్ సైన్స్/ ఇంజినీరింగ్/ ఏఐసీటీఈ నుంచి టెక్నాలజీ డిగ్రీని కనీసం రెండో శ్రేణిలో పూర్తిచేసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
వయసు: మే 31, 2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీ వారికి మూడేళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ వారికి అయిదేళ్లు వయః పరిమితిలో సడలింపు ఉంది.
ప్రవేశం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఫిఇక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, ఇంజినీరింగ్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. దీనిలో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తంగా పది నుంచి గ్రాడ్యుయేషన్‌తోపాటు ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూలకు కేటాయించిన వెయిటేజీ ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు. వెయిటేజీలు- పది (10%), ఇంటర్/ 12వ తరగతి (10%), గ్రాడ్యుయేషన్ (30%), ప్రవేశపరీక్ష (30%), ఇంటర్వ్యూ (20%). దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తుకు పది నుంచి డిగ్రీవరకూ ధ్రువపత్రాల నకళ్లను జతచేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.500. ఐఐపీ ముంబయి పేరిట డీడీ తీయాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: జూన్ 11, 2021 రాతపరీక్ష తేదీ: జూన్ 18, 2021
వెబ్‌సైట్: https://www.iip-in.com/
మార్కెట్ గణాంకాల ప్రకారం..
దేశంలో బలంగా ఎదుగుతున్న రంగాల్లో ప్యాకేజింగ్ ఒకటి. ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వే ప్రకారం 2025 నాటికి మార్కెట్ 204.81 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఫార్మాస్యూటికల్స్, ఆహారం, పానీయ పరిశ్రమల అభివృద్ధీ ఇందుకు ప్రధాన కారణమే. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ప్రకారం ప్యాకేజింగ్ వినియోగం దశాబ్ద కాలంలో 200% పెరిగిందని అంచనా.
ప్రాసెస్‌డ్ ఫుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరగడమూ ఈ రంగానికి కలిసొచ్చే అంశం. అంతర్జాతీయ సంస్థలు ఫుడ్, బెవరేజెస్, కాస్మొటిక్స్, టాయ్‌లెటరీస్, ఫార్మాస్యూటికల్స్ వంటి ప్రధాన విభాగాలపై చూపుతున్న ఆసక్తీ దీని అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ-కామర్స్ రంగం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతుండటంతో రవాణాకు ప్రత్యేక ప్యాకింగ్ అవసరమవుతోంది. మార్కెట్ అవసరాలకూ, ప్యాకేజింగ్ యూనిట్లకూ తగ్గట్టుగా మానవ వనరులు మాత్రం కొరవడుతున్నాయి. దీంతో ఈ రంగంలో నిపుణుల అవసరం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో సంస్థలు ప్రత్యేకంగా కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తిచేస్తే ప్యాకేజింగ్ రంగంలో అవకాశాలను అందుకోవచ్చు.
మార్కెట్ అవసరాలకూ, ప్యాకేజింగ్ యూనిట్లకూ తగ్గట్టుగా మానవ వనరుల అవసరం పెరుగుతోంది.
ఏయే కోర్సులు?
వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వివిధ రకాల కోర్సులను అందిస్తున్నాయి. సాధారణంగా డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంటెక్, మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా, ఇతర స్వల్పకాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
‣ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ల కాలవ్యవధి ఒకటి నుంచి మూడు నెలలు. సాధారణంగా ప్యాకేజింగ్ రంగంలో ఆంత్రప్రెన్యూర్ నైపుణ్యాల కోసం చూసేవారు వీటిని ఎంచుకోవచ్చు. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత రంగంలో కనీసం ఏడాదిపాటు అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. డిప్లొమా ఇన్ టెక్నాలజీతోపాటు రెండేళ్ల అనుభవం ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
‣ డిప్లొమా స్థాయిలో.. ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సులున్నాయి. కోర్సుల కాలవ్యవధి ఏడాది నుంచి మూడేళ్లు. ఏడాది డిప్లొమా కోర్సులకు ఇంటర్మీడియట్, మూడేళ్ల డిప్లొమా కోర్సులకు పదో తరగతి పూర్తిచేసినవారు అర్హులు. మూడేళ్ల డిప్లొమాకు ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది. సాధారణంగా రాష్ట్ర స్థాయిలో పాలిటెక్నిక్ పరీక్షను రాయాల్సి ఉంటుంది.
‣ అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు.. మేనేజ్‌మెంట్ అంశాల్లో అందుబాటులో ఉన్నాయి. కాలవ్యవధి మూడు నెలల నుంచి ఏడాది. ఇంటర్ లేదా తత్సమాన విద్య పూర్తిచేసినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ విభాగానికి చెందినవారైనా అర్హులే.
‣ డిగ్రీ స్థాయిలో.. ప్యాకేజింగ్ టెక్నాలజీలో బీఈ, బీటెక్ కోర్సులున్నాయి. కాలవ్యవధి నాలుగేళ్లు. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/ తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. ప్రొడక్షన్ టెక్నాలజీలో డిప్లొమా చేసినవారు లేటరల్ ఎంట్రీ విధానంలో ఈ కోర్సులో చేరొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ప్రాథమిక అంశాలపై అవగాహన తప్పనిసరి. సంస్థను బట్టి ప్రవేశ విధానాల్లో మార్పులున్నాయి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ప్రవేశపరీక్ష నిర్వహించి, ప్రవేశాలు కల్పిస్తుండగా.. చాలావరకూ జాతీయ, రాష్ట్ర ప్రవేశపరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
‣ పీజీ డిప్లొమా కోర్సుల కాలవ్యవధి రెండేళ్లు. సెమిస్టర్ విధానం ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లూ క్యాంపస్‌లో సాగితే నాలుగో సెమిస్టర్‌లో దేశవ్యాప్తంగా ఏదైనా సంస్థలో ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, సైన్స్ విభాగాల్లో డిగ్రీ చేసినవారెవరైనా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. కొన్ని సంస్థలు ఇంటర్వ్యూనూ నిర్వహిస్తున్నాయి.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు
‣ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, ముంబయి, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, న్యూదిల్లీ
‣ జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, హైదరాబాద్
‣ ఐఐటీ, రూర్కీ
‣ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, న్యూదిల్లీ
‣ ఐఐజీటీ స్కూల్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్, థానే, మహారాష్ట్ర
‣ ఎస్‌ఐఈఎస్ స్కూల్ ఆఫ్ ప్యాకేజింగ్, నవీ ముంబయి
‣ అన్నా యూనివర్సిటీ, తమిళనాడు
‣ తేజ్‌పూర్ యూనివర్సిటీ, అసోం