ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇటీవల మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా స్వతంత్ర అభ్యర్థిని గెలిపించుకున్న ప్రభాకర్‌రెడ్డి.. ఎన్నికను బాయ్‌కాట్ చేసిన పెద్దారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రెడ్డి సోమవారం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయగా.. కమిషన్‌ర్‌తో పాటు సిబ్బంది భేటీకి కాకుండా పెద్దారెడ్డి నిర్వహించిన మరో ర్యాలీలో పాల్గొన్నారు. దీనిపై మండిపడ్డ ప్రభాకర్‌రెడ్డి.. మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలోనే నిరసనకు దిగడంతోపాటు.. మున్సిపల్ సిబ్బంది కనబడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలుగుదేశం నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి..వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పురపాలక సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ.. పట్టణ ప్రజలు ఫిర్యాదు చేయడంతో..జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఉదయం పదిన్నరకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. కమిషన్‌ర్‌తో పాటు మిగిలిన సిబ్బందికి ముందుగానే సమాచారం అందించారు. సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి మున్సిపల్ కమిషన్‌ర్‌తో పాటు సిబ్బందితో..కరోనా మూడోదశపై ర్యాలీ, సమీక్షా సమావేశం నిర్వహించారు.
మధ్యాహ్నం నుంచి సెలవుపై..
ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్‌రెడ్డి.. ఎమ్మెల్యే పెద్దారెడ్డితో సమీక్ష ముగిసిన తర్వాతైనా అధికారులు వస్తారు కదా అంటూ.. మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తన చాంబర్లో కౌన్సిలర్లతో కలిసి నిరీక్షించారు. అయితే ఎమ్మెల్యే కార్యక్రమం ముగియగానే కమిషనర్, సిబ్బంది నేరుగా ఇంటికెళ్లిపోయారు. ఆ తర్వాత కమిషనర్ నరసింహ ప్రసాద్‌రెడ్డి ఇతరులకు బాధ్యతలు అప్పగిస్తూ.. మధ్యాహ్నం నుంచి సెలవుపై వెళ్లిపోయారు.
జేసీ ఆగ్రహం..
ఈ పరిణామంతో ఆగ్రహానికి గురైన ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి.. కార్యాలయంలోనే బైఠాయించారు. తనకు సమాచారం ఇవ్వకుండా, ఆదేశాలను అమలు చేయకుండా కమిషన్‌ర్ సెలవుపై ఎలా వెళ్తారంటూ సిబ్బందికి నోటీసులు పంపారు. కమిషనర్ వచ్చేవరకు కదలబోనంటూ.. మున్సిపల్ కార్యాలయం ఆవరణలోనే రాత్ర కూడా నిరసన చేపట్టారు.
పోలీసులకు ఫిర్యాదు..
రాత్రి అవుతున్నా.. 26మంది పురపాలిక సిబ్బంది రాకపోవడంతో.. తమ సిబ్బంది కనిపించడం లేదంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి పోలీసులను ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుతో తాడిపత్రి రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది.
ఇదీ చూడండి: GRMB, KRMB Meeting: బోర్డుల సమన్వయ కమిటీ సమావేశాలకు తెలంగాణ హాజరు అనుమానమే!