జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం ఇళ్లకే పరిమితమైన రాజకీయ ప్రముఖులు... సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొడుతూ అత్యవసర సేవల సిబ్బందికి సంఘీభావం తెలిపారు. దేశం కోసం కృషి చేస్తున్న వారి సేవలను అభినందించారు. అత్యవసర సర్వీసులు అందిస్తూ ప్రజల ప్రాణాల రక్షణకు పాటుపడుతున్న సిబ్బంది సేవలు ప్రశంసనీయమని ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. వైద్య-ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో కలిసి... తాడేపల్లి నివాస ప్రాంగణంలో కరతాళ ధ్వనులు చేశారు.
చంద్రబాబు సంఘీభావం
హైదరాబాద్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం అధినేత చంద్రబాబు... సాయంత్రం 5గంటలకు చప్పట్లు కొట్టారు. కరోనా వైరస్ నివారణ కోసం కృషిని... చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్, మనవడు దేవాన్ష్ అభినందించారు.
జనసేనాని గంటానాదం
జనసేన అధినేత పవన్‌కల్యాణ్... హైదరాబాద్ నివాసంలో జనతా కర్ఫ్యూ పాటించారు. అత్యవసర సేవల సిబ్బందిని అభినందిస్తూ గంట మోగించారు. గుంటూరులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు చరిచారు. ప్రజలందరూ జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
గో కరోనా నినాదాలు
మంత్రి అనిల్ కుమార్, వైకాపా ఎమ్మెల్యేలు రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుడివాడ అమర్నాథ్.. వారి నివాస ప్రాంగణాల్లో కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు చరిచారు. కరోనా బాధితులకు అత్యవసర సేవలకు అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి... "గో కరోనా" అంటూ నినదించారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఉపసభాపతి కోన రఘుపతి, ఆయన కుటుంబీకులు చప్పట్లు కొట్టారు. బాపట్ల తెదేపా నేత నరేంద్రవర్మ, స్థానిక ప్రజలు, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది కరతాళ ధ్వనులు చేశారు.
కలెక్టర్లు సైతం
కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి... కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. వైద్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు. కలెక్టర్ వీరపాండియన్... సతీమణితో కలిసి చప్పట్లు చరుస్తూ మద్దతు తెలిపారు. మంత్రాలయంలో పీఠాధిపతి ఆధ్వర్యాన అందరూ చప్పట్లు మోగించారు.
చేయి కలిపిన ప్రజాప్రతినిధులు
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వాడపాలెంలో మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనందరావు కుటుంబీకులతో కలసి చప్పట్లు కొట్టారు.
ఇదీ చదవండి : మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్