ఏప్రిల్ 15 నుంచి దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో బీసీ జనాభా ప్రత్యేకంగా లెక్కించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ నెల 23న దిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించే 'బీసీ జనగర్జన'కు సంబంధించిన గోడపత్రికను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సభకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీలు హాజరుకానున్నారని తెలిపారు. దీనికి పార్లమెంటులో ప్రాతినిథ్యం ఉన్న అన్ని పార్టీల, అఖిలపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం బీసీలపై వివక్ష చూపుతోందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. భాజపా అధికారంలోకి వచ్చి ఆరు సంవత్సరాలైనా బీసీలకు చట్టసభల్లో, ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశాన్ని పట్టించుకోలేదన్నారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సరైన జనాభా లెక్కలు లేనందున 50శాతం రిజర్వేషన్లు దాటరాదనే సుప్రీకోర్టు నిబంధనతో అరవై కోట్ల మంది బీసీల గొంతు కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న కమలనాథులు: కేసీఆర్