కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గాజులపేటలో ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ‘జగమంతా వనం... ఆరోగ్యంతో మనం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవంలో భాగంగా ఇబ్రహీంపట్నంలోని పేదల ఇళ్ల స్థలాల ప్రదేశంలో సీఎం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే తెలుగుదేశం నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. దేవుడి దయతో కోర్టు కేసుల అడ్డంకులన్నీ తొలగిపోతే ఆగస్టు 15న 30లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఈ ఏడాదిలో 20కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం తెలిపారు. జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.