SSLV Rocket Launch Fail: చిన్న రాకెట్లతో ఉపగ్రహ ప్రయోగాల్లో కొత్త శకం లిఖిద్దామనుకున్న ఇస్రోకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దేశం 75ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న వేళ.. దేశ తొట్ట తొలి చిన్న ఉపగ్రహ వాహకనౌక SSLV-D1 ప్రయోగం విఫలమైంది. ప్రాథమిక దశలను విజయవంతంగా దాటుకుని నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ రాకెట్.. ఉపగ్రహాలను తప్పుడు కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వాహకనౌక EOS-02, అజాదీశాట్ ఉపగ్రహాలను వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ.. సాంకేతిక సమస్య కారణంగా దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఫలితంగా రెండు ఉపగ్రహాలూ పనికిరావని ఇస్రో వెల్లడించింది.సెన్సార్ వైఫల్యమే ఇందుకు కారణమని తేల్చింది. త్వరలో SSLV-D2 చిన్న ఉపగ్రహ వాహకనౌకను ప్రవేశపెడతామని ఇస్రో ప్రకటించింది.
ఆదివారం ఉదయం 9.18 గంటలకు తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ.. మూడు దశలు అనుకున్నట్లుగానే పూర్తయినట్లు ఇస్రో వెల్లడించింది. అయితే.. టెర్మినల్ దశకు సంబంధించిన సమాచారం రావడంలో జాప్యం జరిగినట్లు తొలుత ప్రకటించింది. ఆ తర్వాత రాకెట్ గమనాన్ని విశ్లేషిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ వెల్లడించారు. ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరుకున్నాయో.. లేదో.. విశ్లేషించి మిషన్ తుది ఫలితంపై త్వరలో సమాచారమిస్తామని తెలిపారు. కానీ.. చివరకు మిషన్ విఫలమైందని ప్రకటించారు.
ఇస్రో ఇప్పటిదాకా చిన్న, మధ్యస్థ, ఓ మోస్తరు బరువైన ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారానే కక్ష్యలోకి పంపేది. దీన్ని తయారుచేసేందుకు 600 మంది 70 రోజులు శ్రమించాల్సి వచ్చేది. అదే చిన్న ఉపగ్రహ వాహకనౌకకు ఆరుగురు శాస్త్రవేత్తలు 72 గంటల్లోనే రూపకల్పన చేయగలరు. ఇందుకయ్యే ఖర్చు కూడా రూ.30 కోట్లే. దీని పొడవు 34 మీటర్లు, వ్యాసం 2 మీటర్లు. ఇది 10 నుంచి 500 కిలోల వరకు బరువున్న వాణిజ్య ఉపగ్రహాలను సమీప భూకక్ష్యలో ప్రవేశపెట్టగలదు.
ఇవాళ మోసుకెళ్లిన ఉపగ్రహాలు ఇవీ : ఎస్ఎస్ఎల్వీ రాకెట్ నేడు ఈఓఎస్-02, ఆజాదీశాట్ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. ఇందులో ఈఓఎస్-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంలో సాయపడుతుంది. ఇక, ఆజాదీశాట్ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని రూపొందించారు. 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం, ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌కు గుర్తుగా దీన్ని రూపొందించారు. దీని జీవితకాలం ఆరు నెలలు. ఇందులో రవీంద్రనాథ్ ఠాగూర్ పాడిన జాతీయ గీతం రికార్డ్ వెర్షన్‌ను పొందుపర్చారు. కానీ.. ప్రయోగం విఫలం కావడం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది.
ఇస్రో ఇప్పటిదాకా చిన్న, మధ్యస్థ, ఓ మోస్తరు బరువైన ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారానే కక్ష్యలోకి పంపేది. దీన్ని తయారుచేసేందుకు 600 మంది 70 రోజులు శ్రమించాల్సి వచ్చేది. అదే చిన్న ఉపగ్రహ వాహకనౌకకు ఆరుగురు శాస్త్రవేత్తలు 72 గంటల్లోనే రూపకల్పన చేయగలరు. ఇందుకయ్యే ఖర్చు కూడా రూ.30 కోట్లే. దీని పొడవు 34 మీటర్లు, వ్యాసం 2 మీటర్లు. ఇది 10 నుంచి 500 కిలోల వరకు బరువున్న వాణిజ్య ఉపగ్రహాలను సమీప భూకక్ష్యలో ప్రవేశపెట్టగలదు. ఇది అంతరిక్ష రంగం, ప్రైవేటు భారతీయ పరిశ్రమల మధ్య మరింత సహకారాన్ని సృష్టించనుంది.
"మూడు దశల ప్రయోగాలు పూర్తయ్యాయి. తుదిదశ సమాచార సేకరణలో కొంత ఆలస్యం. ప్రయోగ పురోగతిపై వీలైనంత త్వరగా సమాచారం ఇస్తాం. సమాచార విశ్లేషణలో ఇస్రో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించాయా? లేదా? అని విశ్లేషిస్తున్నాం."
ఇస్రో ఛైర్మన్
ఇవీ చదవండి: