ఉత్తర్వు సరి చేయాలని కోరేందుకే ఏపీ సీఎస్‌ను కలవాలని అనుకున్నానని... తనను కలిసేందుకు సీఎస్ ఇష్టపడడం లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. తన వినతిపత్రం చదివితే దానిలో ఏముందో తెలిసేదన్నారు. జీఏడీలో రిపోర్ట్ చేయడం వరకే తన పని అని స్పష్టం చేశారు. సస్పెన్షన్ ఎత్తివేత అనంతరం జీఏడీలో రిపోర్ట్ చేసిన ఆయన... విజయవాడలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.
"జీఏడీలో రిపోర్ట్ చేయడం వరకే నా పని. రెండేళ్ల సస్పెన్షన్ గురించి మాట్లాడటం లేదు. ఉత్తర్వు సరిచేయాలని కోరేందుకే సీఎస్‌ను కలవాలని అనుకున్నా. పోస్టింగ్ ఇవ్వలేదు.. జీతం ఇచ్చేందుకు ఇబ్బంది ఏమిటి ?. తప్పు చేస్తే శిక్షించాలి లేదా సమయానికి జీతం ఇవ్వాలి. చట్టప్రకారం మాత్రమే ముందుకెళ్లా. నాకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. నా సస్పెన్షన్ చట్టవిరుద్ధమని ఏపీ హైకోర్టు చెప్పింది. నేనేం తప్పు చేశానో అధికారులు తేల్చాలి. నేను ఏమైనా తప్పులు చేస్తే బయటకు చెప్పాలి కదా." -ఏబీ వెంకటేశ్వరరావు, సీనియర్ ఐపీఎస్ అధికారి
చెడ్డ పనులు చేసేందుకు తానెప్పుడూ ప్రయత్నించలేదని ఏబీ వెంకటేశ్వరావు అన్నారు. విజయవాడ సీపీగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్లి ఎఫ్‌ఐఆర్ కాపీ ఇచ్చామని గుర్తు చేశారు. తాను సీపీగా ఉన్నప్పుడు కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టామని..,పోలీసులు తప్పు చేసినప్పుడు వెంటనే ఆపేవాడినని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా పని చేయాలని పోలీసులకు సూచించేవాడినని అన్నారు. తనపై అనేక ఆరోపణలు, ఫిర్యాదులు చేశారన్నారు. ఏదైనా అనే ముందు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల తన గురించి తెలుసుకోవాలని సూచించారు.
అప్పటి నుంచి వెయిటింగ్ పీరియడ్: నిఘా విభాగాధిపతిగా పని చేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 2020 ఫిబ్రవరి 8న ఏపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ప్రతి 6 నెలలకు ఒకసారి దానిని పొడిగిస్తూ వచ్చింది. ఆయనపై వేటు వేసి ఈ ఏడాది ఫిబ్రవరి 8 నాటికి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ ఏప్రిల్ 22న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాని గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీతో ముగిసినందున సస్పెన్షన్ చెల్లదని పేర్కొంది. ఫిబ్రవరి 7 నుంచి ఆయన సర్వీసులో ఉన్నట్లు పరిగణించాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల లేఖ రాశారు. ఆయనను కలిసి కూడా కోరారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించి సర్వీసులోకి తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేయగా అవి నిన్న(బుధవారం) వెలుగుచూశాయి. పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి విధుల్లో రిపోర్టు చేసేంతవరకూ కంపల్సరీ వెయిటింగ్‌గా పరిగణించనున్నట్లు పేర్కొంది.
ఇవీ చూడండి: లండన్‌లో కేటీఆర్.. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ