గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి జీహెచ్‌ఎంసీ దరఖాస్తులను ఆహ్వానించింది. ముగ్గురు కో-ఆప్షన్ సభ్యుల్లో ఒకరిని మహిళను నియమిస్తామని జీహెచ్‌ఎంసీ పేర్కొంది.
కో ఆప్షన్ సభ్యులుగా దరఖాస్తు చేసుకునే వారికి మున్సిపల్ పరిపాలనలో అనుభవంతోపాటు కార్పొరేషన్ పరిధిలో ఓటరుగా ఉండాలని పేర్కొంది. జీహెచ్‌ఎంసీ వార్డు లేదా ఏరియా కమిటీలో కనీసం మూడేళ్ల పాటు నామినేటెడ్ సభ్యుడిగా ఉండడం సహా ఏదైనా స్వచ్ఛంద సంస్థలో కనీసం ఏడేళ్లపాటు సోషల్ వర్కర్‌గా పనిచేసిన అర్హత ఉన్న వారంతా దరఖాస్తు చేసుకోవచ్చునని జీహెచ్‌ఎంసీ ప్రకటన విడుదల చేసింది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 30 నుంచి ఏప్రిల్ 19 వరకు అన్ని పనిదినాల్లో కార్యాలయంలోని సెక్రటరీ విభాగంలో దరఖాస్తులు అందించాలని సూచించారు. ఏప్రిల్ 20 నుంచి 29 తేదీల్లో అందిన దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపింది. అర్హులైన సభ్యులను ప్రత్యేక జనరల్ బాడీ సమావేశంలో కార్పొరేటర్లు, ఎక్స్‌ఆఫిషియో సభ్యులు మూజువాణి ఓటుతో ఎన్నుకుంటారని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.