రాష్ట్రంలో రైతుల ఆదాయం రెట్టింపుతో పాటు ఉత్పాదకత పెంపులో వ్యవసాయ అంకుర కేంద్రాలు కీలక పాత్ర పోషించాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు సూచించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో వీసీ సమక్షంలో అగ్రిహబ్ ఫౌండేషన్‌తో 11 అంకుర కేంద్రాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ పరస్పర అవగాహన ఒప్పంద పత్రాలపై విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్, వివిధ అంకుర కేంద్రాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో గత 6 ఏళ్లల్లో విశ్వవిద్యాలయం అనేక రంగాల్లో ప్రగతి సాధించిందని ఉపకులపతి ప్రవీణ్‌రావు తెలిపారు. అనూహ్య వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ కార్యక్రమాలు, నూతన వండగాల అభివృద్ధి విడుతలతో పాటు కొత్త సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరవేయడం వల్ల వర్సిటీపై ఎంతో నమ్మకం ఏర్పడిందన్నారు. సేద్యాన్ని లాభసాటిగా తీర్చిదిద్దడం, రైతుల ఆదాయాలు రెట్టింపు చేసే క్రమంలో పంటల ఉత్పత్తి, ఉత్పాదతక పెంపొందించడంలో వ్యవసాయ అంకుర కేంద్రాలు కీలక భూమిక పోషించాలని సూచించారు. అగ్రిహబ్ ప్రారంభానికి సహకరించిన అందరికీ వీసీ కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఆన్‌లైన్ వర్చువల్ పద్ధతిలో కొందరు ప్రతినిధులు పాల్గొనగా... ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, అగ్రిహబ్ ఇంఛార్జి డాక్టర్ కల్పనాశాస్త్రి, విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ పురుషోత్తమ్‌కౌషిక్, నగరాజ ప్రకాశం, రమాదేవి, అనిల్‌కుమార్ తదితరులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు.