Interstate fake notes gang arrest: జిరాక్స్ సెంటర్ మాటున నకిలీ కరెన్సీ ముద్రించి హైదరాబాద్ సహా వేర్వేరు నగరాల్లో చలామణి చేస్తున్న ముఠా గుట్టును నగర పోలీసులు ఛేదించారు. కర్ణాటక కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠాలోని ఇద్దరు సభ్యుల్ని ఎంజీబీఎస్ దగ్గర దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్, మీర్‌చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు హైదరాబాదీ ఉన్నారు. వీరినుంచి రూ.2.5 లక్షల(100, 200, 500, 2వేల నోట్లు) నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు కర్ణాటకకు చెందిన శేఖర్ పరారీలో ఉన్నాడు. ఈ వివరాలను గురువారం పురానీహవేలీలోని పోలీసు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్సు అదనపు డీసీపీ స్నేహమెహ్రా, మీర్‌చౌక్ ఏసీపీ ప్రసాద్‌రావు, ఇన్‌స్పెక్టర్ ఎం.అప్పలనాయుడు, టాస్క్‌ఫోర్సు ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్రతో కలిసి దక్షిణ మండలం డీసీపీ పి.సాయిచైతన్య మీడియాకు వెల్లడించారు. కర్ణాటకలోని హుల్సూరుకు చెందిన శేఖర్ స్థానికంగా ఎన్‌ఎస్ కంప్యూటర్స్ జిరాక్స్ కేంద్రం నిర్వహిస్తున్నాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు నకిలీ నోట్లు ముద్రించాలని పథకం పన్నాడు. పరికరాలు, యంత్రాన్ని సేకరించి ముద్రణ మొదలుపెట్టాడు.
ఈ నోట్లను సమీప బంధువు, మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఇస్లాంపురకు చెందిన సయ్యద్ అన్సార్(27)తో మార్కెట్లో చలామణి చేయించాడు. ఇందుకు రూ.8 వేల అసలైన కరెన్సీకి రూ.50 వేల నకిలీ నోట్లను విక్రయించాడు. అతడు హైదరాబాద్‌లో ఫలక్‌నూమాకు చెందిన స్కూల్ బ్యాగుల తయారీదారు షేక్ ఇమ్రాన్(33)కు విక్రయించాడు. వీరు రూ.15వేలు చెల్లిస్తే రూ.50వేల నకిలీ నోట్లు ఇచ్చాడు. ఈ క్రమంలో అన్సార్ హైదరాబాద్‌కు వచ్చాడు. సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్, మీర్‌చౌక్ పోలీసులు అన్సార్, ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చదవండి: