ఖతార్‌లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఆంధ్ర కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నా పెద్ద అందరు పాల్గొన్నారు. ఆట పాటలతో ఉత్సాహంగా గడిపారు. గీతాలు, పాటలు, పద్యాలు, కథలు, శ్లోకాలు, సామెతలపై చిన్నారులకు పోటీలు నిర్వహించారు. పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ భాషా ప్రావిణ్యంతో అందరిని ఆకట్టుకున్నారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు అందించారు.
కార్యక్రమానికి ఖతర్‌లోని దిల్లీ పబ్లిక్ స్కూల్, భవన్స్, బిర్లా పబ్లిక్ స్కూల్, ఎంఈఎస్‌కు చెందిన తెలుగు ఉపాధ్యాయులు హాజరయ్యారు. తెలుగు భాష పట్ల చిన్నారుల్లో ఆసక్తిని పెంచిన వీరిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. తెలుగు భాష గొప్పతనం గురించి స్థానిక ఉపాధ్యాయురాలు నఫీసా వివరించారు. విజయవాడకు చెందిన టీచర్ నఫీసా గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు.
ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించుకోవాలని.. మాతృభూమికి దూరంగా ఉన్నా.. ఇలాంటి కార్యక్రమాలతో కలుసుకోవడం సంతోషంగా ఉందని స్థానికంగా ఉన్న తెలుగువారు సంతోశం వ్యక్తం చేశారు. వేడుకను విజయవంతం చేసిన అందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: టీపీసీసీ అధ్యక్ష రేసులో ఇద్దరు ఎంపీలు