ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నెల రోజుల తర్వాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు రాస్తున్న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ఇప్పటికే ప్రమోట్ అయి రెండో సంవత్సరం చదువుతున్నారు. హైకోర్టు, ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వచ్చే ఏడాది కొవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోతే... ప్రస్తుతం రాసిన ప్రథమ సంవత్సరం మార్కులనే ప్రామాణికంగా తీసుకుని రెండో ఏడాదికి ఉత్తీర్ణత చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షలు రాయాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 59 వేల మంది ఇంటర్ విద్యార్థులు ఉండగా.. వారికోసం 17 వందల 68 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
అయితే అనేక మంది విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లోనే రాయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. రెండో సంవత్సరం సిలబస్ చదువుతూనే... మళ్లీ పరీక్షల కోసం మొదటి సంవత్సరం సిలబస్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తోందని అంటున్నారు.
మరోవైపు గత ఏడాది మొత్తం ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించడంతో... లక్షలాది మంది వాటికి దూరం కావాల్సి వచ్చింది. ఇంటర్‌నెట్ సమస్యల కారణంగా చాలా మంది క్లాసులు ఫాలో అవలేకపోయారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈనెల 31 ఆదివారం కూడా పరీక్ష ఉంటుందని... విద్యార్థులు గమనించాలని ఇంటర్ బోర్డు కోరింది.