ఆంధ్రప్రదేశ్లో పది, ఇంటర్మీడియట్ పరీక్షలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జులై 31లోపు పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు(supreme court) ఆదేశించిన నేపథ్యంలో.. మొత్తంగా పరీక్షలే రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్కులను ఎలా కేటాయించాలన్నదానిపై త్వరలోనే కమిటీ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్(minister Suresh) స్పష్టం చేశారు.
అది సాధ్యం కాదు..
సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుని పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. జులై 31లోగా పరీక్షల ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంత తక్కువ సమయంలో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి అసాధ్యం కాబట్టే పరీక్షల రద్దుకు నిర్ణయించామని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. పరీక్ష ప్రక్రియ పూర్తికి 40 రోజులు, విద్యార్థులు ప్రిపేర్ అయ్యేందుకు 15 రోజులు సమయం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సమాయత్తం కావటంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి లోపం లేదని.. అన్ని నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ప్రయత్నించామని తెలిపారు.
ఫలితాలపై హైపవర్ కమిటీ
ఇంటర్ ఫలితాల తర్వాతే గ్రాడ్యుయేషన్ ప్రవేశాలు నిర్వహించాలని సుప్రీం కోర్టు సూచించినందున.. ఇతర బోర్డులు పరీక్షలను రద్దు చేసినందున రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరగదని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితాలు ఎలా ఇవ్వాలన్న దానిపై విధివిధానాలు రూపొందించేందుకు హైపవర్ కమిటీ(high power committee)ని ఏర్పాటు చేయనుంది. మార్కుల మదింపు ఎలా చేయాలన్నదానిపై పది రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం సూచించినందున అందుకనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు.
పరీక్షల రద్దు నిర్ణయం
కరోనా తీవ్రత దృష్ట్యా గత 2 నెలల నుంచి రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షల రద్దుకు తల్లిదండ్రులు, రాజకీయపక్షాలు సహా అన్ని వర్గాలూ డిమాండ్ చేశాయి. అత్యధిక రాష్ట్రాలు కొవిడ్ నేపథ్యంలో పరీక్షల్ని రద్దు చేయగా.. ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాలు నిర్వహణకే మొగ్గుచూపాయి. పరీక్షలు పెట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటర్ పరీక్షల నిర్వహణకు అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. 2 రోజులపాటు దీనిపై జరిగిన విచారణలో అనేక అంశాలకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ విధానాలను తప్పుబట్టింది. సుప్రీం కోర్టు పెట్టిన షరతలు, ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణ కష్టతరమని భావించిన ప్రభుత్వం.. పరీక్షల రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మార్కులు ఎలా ఇస్తారో?
ఇంటర్ రెండో ఏడాది విద్యార్థులకు మొదటి సంవత్సరం మార్కులు, ప్రాక్టికల్ మార్కులను ప్రామాణికంగా తీసుకుని మార్కులు కేటాయించే అవకాశం ఉంది. పదో తరగతి(10th class) విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వనున్నారు. మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు ఇస్తే ట్రిపుల్‌ఐటీ లాంటి సంస్థల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాల్సి అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. గతేడాది పరీక్షలను రద్దు చేసినప్పటికీ విద్యార్థులకు ఎలాంటి మార్కులు, గ్రేడ్లు ఇవ్వలేదు. ఉత్తీర్ణులైనట్లు మాత్రమే పేర్కొంటూ మార్కుల జాబితాను విడుదల చేశారు. దీంతో ఇప్పుడు మార్కులు ఎలా నిర్ణయిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: నేటి నుంచి విధుల్లోకి ఉపాధ్యాయులు, అధ్యాపకులు