General Bipin Rawat - Sai Teja: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌నాయక్ సాయితేజకు చెందిన ఆసక్తికర అంశం బయటకొచ్చింది. సాయితేజ ఆర్మీలో కొనసాగడంపై అతడి తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. ఈ విషయంపై సాయితేజతో మాట్లాడినట్లు అతడి తండ్రి మోహన్ చెప్పారు.
‘నీతో పాటు తమ్ముడినీ ఆర్మీకి తీసుకెళ్లావు. పదోన్నతులు తెచ్చుకుంటున్నావు. ఇదంతా బాగానే ఉన్నా.. ప్రాణాల మీదకు వచ్చే ఉద్యోగం మనకొద్దు.. మానుకో’ అంటూ తండ్రి మోహన్ చెప్పినా, సార్ (బిపిన్ రావత్)తోనే ఉంటానంటూ అమరుడైన లాన్స్‌నాయక్ సాయితేజ బదులిచ్చారు. పారా కమాండోలకు మెరుగ్గా శిక్షణ ఇస్తుండటంతో బిపిన్ రావత్.. ఏడాది కిందట సాయితేజను తన వ్యక్తిగత భద్రత సిబ్బందిగా నియమించుకున్నారు. రావత్‌ను ఆయన కంటికి రెప్పలా చూసుకునేవారు. ఒకానొక సందర్భంలో తల్లిదండ్రుల ఒత్తిడితో.. ఆర్మీ నుంచి వైదొలుగుతానని సాయితేజ చెప్పారు. ‘నేను ఉన్నంతవరకూ నువ్వూ ఉండు సాయీ’ అని రావత్ చెప్పారని ఆయన తండ్రి మోహన్ పేర్కొన్నారు.
ఆర్మీ సిఫాయిగా చేరి..
Lance Naik Sai Teja dead: సాయితేజ్.. 2013లో ఆర్మీ సిఫాయిగా చేరాడు. సిఫాయిగా పని చేస్తూ ఏడాది తర్వాత పరీక్షలో ఉత్తీర్ణుడై పారా కమాండోగా ఎంపికయ్యాడు. లెవెన్త్ పారాలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. బెంగళూరులో సిఫాయిలకు శిక్షకుడుగా పని చేసిన సాయితేజ్.. ప్రస్తుతం బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సాయితేజ్‌కు భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞ, కూతురు దర్శిని ఉన్నారు. వీరి కుటుంబం గత ఏడాదిగా మదనపల్లె ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటుంది. మరోవైపు సాయితేజ్ మరణంతో.. గ్రామంలో విషాదం నెలకొంది.
హెలికాప్టర్ ఘటనలో.. ఏం జరిగిందంటే
Bipin Rawat passed away: హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న Mi-17V5 చాపర్ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగానూ 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.
లెక్చర్ ఇచ్చేందుకు వెళ్లి..
కోయంబత్తూర్ సమీపంలోని సూలూర్ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన Mi-17V5 చాపర్.. కూనూర్ సమీపంలోని కట్టేరి- నాంచప్పనంచథ్రం వద్ద మధ్యాహ్నం 12.20-12.30 గంటల ప్రాంతంలో కూలిపోయింది. జనరల్ రావత్.. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ స్టాఫ్ కాలేజ్‌లో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పొగమంచుతో వెలుతురు సరిగా లేకపోవడమే.. ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. చాపర్.. నివాస ప్రాంతాలకు కాస్త దూరంగా కూలిపోవడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది. ఘటన సంబంధిత దృశ్యాలు.. భయానకంగా ఉన్నాయి. హెలికాప్టర్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది.బిపిన్ రావత్ మృతిపట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. రావత్ సేవలను గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: Last Rites of CDS: దిల్లీలోని నివాసానికి రావత్ దంపతుల భౌతికకాయాలు