నిబంధనలు పాటించనందున ఎందుకు మూసివేయరాదో మూడు రోజుల్లో తెలపాలని 79 కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటీసులు జారీ చేసింది. రేపు పత్రికల ద్వారా బహిరంగ నోటీసు కూడా ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. గుర్తింపు లేని కాలేజీలపై చర్యలు తీసుకొని.. ఈనెల 25లోగా నివేదిక సమర్పించాలని ఇటీవల హైకోర్టు స్పష్టం చేసిన విషయం విదితమే.
కళాశాలల ప్రతినిధులతో సమావేశం..
కళాశాలల యాజమాన్యాలు, అసోసియేషన్ల ప్రతినిధులతో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ సమావేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు యాజమాన్యాలు సహకరించాలని ఆమె కోరారు. అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ లేకపోతే కళాశాలలు నడిపేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
ప్రాణాలతో చెలగాటం వద్దు..
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడవద్దని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ కోరారు. త్వరలో పరీక్షలు ప్రారంభం కానున్నందున.. తమకు కొంత సమయం కావాలని యాజమాన్యాల ప్రతినిధులు కోరారు. నోటీసులకు స్పందించకపోతే కాలేజీల మూసివేతకు చర్యలు తీసుకుంటాని జలీల్ తెలిపారు. ఈనెల 25లోగా హైకోర్టుకు నివేదిక సమర్పిస్తామన్నారు.
ఇవీ చూడండి: లాసెట్, పీజీ ఎల్సెట్ షెడ్యూల్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?