వడ్డించేవాడు మనవాడైతే చివరి వరుసలో కూర్చున్నా ఢోకా ఉండదు అన్నట్టుగా మారింది ఏపీలోని విజయవాడ దుర్గగుడిలోని ఉద్యోగోన్నతుల ప్రక్రియ. నిన్నటి వరకు జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ ఉద్యోగికి నేరుగా సూపరింటెండెంట్ ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై.. తోటి సిబ్బంది ఖంగుతిన్నారు. దేవాదాయశాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారి సహకారంతోనే ఇదంతా జరగడం.. పైగా రెండ్రోజుల క్రితమే పదోన్నతుల కల్పనలో కోర్టు వివాదాలకు తావు ఇవ్వొద్దని దేవాదాయ శాఖ మంత్రి చెప్పిన నేపథ్యంలో ఆయా నిబంధనలు పక్కకు నెట్టి ఓ మహిళకు ఉద్యోగోన్నతి కల్పించడం చర్చనీయాంశమైంది.
తొలుత ఇద్దరు ఉద్యోగులకు సూపరింటెండెంట్‌గా ఉద్యోగోన్నతి పొందేందుకు అవకాశం కల్పించారు. ఇందులో ఒక వ్యక్తి వెంటనే బాధ్యతలు చేపట్టగా.. మరో మహిళా ఉద్యోగి స్వీకరించలేదు. ఈ క్రమంలోనే ఆ పదోన్నతికి సంబంధించిన ఉత్తర్వులు తీసుకుని వేరొక మహిళ రావడంతో వివాదాస్పదం అయ్యింది. వాస్తవానికి కొత్తగా వచ్చిన మహిళ గతంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఒకవేళ ఆమెకు ఉద్యోగోన్నతి కల్పిస్తే సీనియర్ అసిస్టెంట్ ఇవ్వాలి కానీ సూపరింటెండెంట్ ఏవిధంగా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మరో వివాదంలో ఇలా...
దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం మాసపత్రిక కనకదుర్గ ప్రభకు ఎడిటర్ పోస్టు ఖాళీ కావడంతో అందులో పనిచేసే ఓ ఉద్యోగి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి ఏఈవో క్యాడర్‌తో సమానమైన ఎడిటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. తనకు ఆ ఉద్యోగం వస్తుందనుకున్న తరుణంలో సదరు ఉద్యోగికి ఆ పోస్టు దక్కకుండా కొందరు వివాదాస్పదం చేశారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం
"ఉద్యోగోన్నతి కల్పన విషయంలో ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు, కోర్టు ఉత్తర్వుల మేరకు నిర్ణయం తీసుకుంటాం. విద్య, సీనియారిటీని పరిగణనలోకి తీసుకున్న తర్వాత పదోన్నతులు కల్పిస్తాం. దుర్గగుడిలో ప్రస్తుతం మూడు సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నందున మరోసారి సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం" - ఈవో భ్రమరాంబ
ఇదీ చదవండి: