విజయవాడ దుర్గమ్మ నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. శార్వరినామ సంవత్సరంలో.. నిజ ఆశ్వయుజ శుక్లపాడ్యమి నుంచి నవమి వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాత సేవతో శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్న ఆ జగన్మాత.. మొదటి రోజు స్వర్ణకవచాలంకృత రూపంలో అభయ ప్రదానం చేస్తోంది. 18న బాలా త్రిపురసుందరీదేవిగా, 19న గాయత్రీదేవిగా, 20న అన్నపూర్ణాదేవిగా, 21న సరస్వతిదేవిగా, 22న లలితా త్రిపురసుందరీదేవిగా, 23న మహాలక్ష్మిదేవిగా, 24న ఉదయం దుర్గాదేవిగా, మధ్యాహ్నం మహిషాసుర మర్దినిగా, 25న రాజరాజేశ్వరిదేవిగా.. దుర్గమ్మ భక్తులను కరుణించనుంది. 18 నుంచి 25వ తేదీ వరకు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే దర్శనం ఉంటుంది. 21వ తేదీ మూలానక్షత్రం రోజున ఉదయం మూడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతిస్తారు. 25వ తేదీ సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన సేవ ద్వారా తెప్పోత్సవం నిర్వహిస్తారు.
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అంతరాలయ దర్శనం రద్దు చేసి.. ముఖమండప దర్శనానికే పరిమితం చేశారు. భక్తులు ముందుగా ఆన్‌లైన్‌లోనే టిక్కెట్టు తీసుకోవాలి. 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్ల వృద్ధులు, దివ్యాంగులకు అనుమతి లేదు. భక్తులతో నిర్వహించే ప్రత్యేక పూజలన్నీ ఈసారి పరోక్షంగానే నిర్వహిస్తారు. తీర్థప్రసాదాలు, శఠారి ఇవ్వడాన్ని రద్దు చేశారు. కేశఖండన, కృష్ణానది ఘాట్‌ల వద్ద స్నానాలకు అనుమతి లేదు. వీఐపీలకు ఉదయం 7నుంచి 9 గంటల వరకు.. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతించాలని దేవస్థానం నిర్ణయించింది. భక్తులందరూ కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని... ఆలయ యంత్రాంగానికీ సహరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:
దుర్గమ్మ శరన్నవ రాత్రి ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు