Independence Day Diamond Jubilee Celebrations: స్వతంత్ర వజ్రోత్సవాల వేళ రాష్ట్రమంతా త్రివర్ణమయం అయ్యింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్క్‌లో జాతీయ పతాకం ఆవిర్భావం నుంచి జరిగిన మార్పులను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. మహనీయుల నుంచి యువత స్ఫూర్తి పొందాలన్నారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ శుభ్రపరిచారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. నల్గొండలో స్వతంత్ర వజ్రోత్సవాలకు మంత్రి జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. వంద ఫీట్ల ఎత్తులో 30 ఫీట్ల జాతీయ జెండాను ఎగురవేశారు. పట్టణంలో భారీ త్రివర్ణ పతాకంతో విద్యార్థులు ప్రదర్శన చేశారు.
హైదరాబాద్‌లో ఈవీ రైడ్ విత్ ప్రైడ్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. టీ హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్ రావు ప్రదర్శన ప్రారంభించారు. తెలుగుతల్లి వంతెన నుంచి బుద్ధ భవన్ వరకు ప్రదర్శన చేశారు. ప్రముఖ మారథాన్ రన్నర్ జగన్‌మోహన్ 75 కిలోమీటర్ల పరుగు తీశారు. సైబరాబాద్ సీపీ కార్యాలయం నుంచి గోల్కోండ మీదుగా రన్ నిర్వహించారు.
కాంగ్రెస్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో కోఠిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రాబ్యాంకు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. నాచారంలో 100 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన చేశారు. ఇందులో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. అమీర్‌పేట్ డివిజన్‌లోని సుందర్ నగర్ కాలనీ, మోడల్ కాలనీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. ఇందులో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో దివిస్ లాబొరేటరీస్ సిబ్బంది ద్విచక్రవాహనాల ప్రదర్శన నిర్వహించారు. చౌటుప్పల్ నుంచి లింగోజిగూడెం వరకు 300 బైక్‌లతో జాతీయ జెండాలు చేతబూని ర్యాలీ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో తిరంగా సంకీర్తనలు చేపట్టారు. ఆదర్శనగర్, వసంత్ విహార్ కాలనీలో హరే రామ హరే కృష్ణ భక్త బృందం భజనలతో దేశభక్తి చాటారు. మంచిర్యాలలో ముస్లిం యూత్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో పురవీధుల గుండా తిరంగా ప్రదర్శన చేశారు. మైనార్టీ భవనం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో తెరాస యువజన విభాగం ఆధ్వర్యంలో స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వంద మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ చేశారు.
ఖమ్మం జిల్లా వైరాలో మత్స్యకారులు వినూత్నంగా దేశభక్తిని చాటారు. వైరా జలాశయంలో తెప్పలపై జాతీయ జెండాలతో నీటిలో ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. తల్లాడలో ముస్లింలు హిందూ ముస్లిం ఐక్యత చాటుతూ 300 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఏన్కూరులో మెకానిక్‌లు భారీ త్రివర్ణ పతాకంతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.
ఇదీ చూడండి: