ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 11.75 అడుగుల నీటిమట్టం ఉంది. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో... నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద.... ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో.. 9 లక్షల 57 వేల 236 క్యూసెక్కులు ఉన్నట్లు విపత్తు సంస్థ కమిషనర్ కె. కన్నబాబు స్పష్టం చేశారు.
ముంపు ప్రభావిత మండలాల అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశామని చెప్పారు. సహాయక చర్యల కోసం ముందస్తుగా నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు వెళ్లడించారు. నదిలో ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున నాటు పడవలు, బోట్లు, స్టీమర్లలో ప్రయాణించవద్దని చెప్పారు. స్థానికులు ఈతకు వెళ్లటం, నదీ స్నానాలకు చేయవద్దని సూచించారు.
ఇదీ చదవండి: Ganesh Chaturthi: వినాయకుడి రూపాలెన్ని? పూజ ఎలా చేయాలి?