బీమా వైద్య సేవల(ఐఎంఎస్) విభాగం కుంభకోణంలో నిందితుల అక్రమాస్తుల స్వాధీనం దిశగా అవినీతి నిరోధక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు ఔషధాలు, పరీక్షల కిట్ల సరఫరా పేరుతో నిందితులు రూ.వందల కోట్లు స్వాహా చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు సేకరించిన ఆధారాల ప్రకారం మాజీ సంచాలకురాలు దేవికారాణితోపాటు ఆమె కుటుంబ సభ్యులకు చెందిన సుమారు రూ.30 కోట్ల వరకు అక్రమాస్తుల్ని అనిశా గుర్తించినట్లు సమాచారం. బహిరంగ విపణిలో వీటి విలువ 2-3 రెట్లు అధికంగా ఉంటుందని అంచనా. మరిన్ని స్థిర, చరాస్తులున్నప్పటికీ వీటి గురించిన సమాచారంపై విచారణలో నిందితురాలు నోరువిప్పలేదని అనిశా భావిస్తోంది.
రంగం సిద్ధం..
ఉదాహరణకు బంజారాహిల్స్‌లోని ఓ నగల దుకాణంలో నిందితురాలు కొనుగోలు చేసిన సుమారు రూ.7 కోట్ల విలువైన ఆభరణాలను అధికారులు గుర్తించలేకపోయారు. దేవికారాణి ఐఎంఎస్ సంచాలకురాలిగా కొనసాగిన సమయంలో సుమారు రూ.800 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయి. వీటిలో సింహభాగం నిధుల్ని నిందితులు పక్కదారి పట్టించినట్లు అనిశా గట్టిగా విశ్వసిస్తోంది.
ఈ లెక్కన వారు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టి ఉంటారని బలంగా నమ్ముతున్న దర్యాప్తు అధికారులు, వాటిని గుర్తించే దిశగా లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు. పనిలోపనిగా ఇప్పటివరకు గుర్తించిన అక్రమాస్తుల్ని స్వాధీనపరుచుకునే కసరత్తు ముమ్మరం చేశారు. దేవికారాణితోపాటు మాజీ సంయుక్త సంచాలకురాలు పద్మ, మాజీ సహాయ సంచాలకురాలు వసంత ఇందిర తదితరుల అక్రమాస్తులపై అనిశా కార్మిక శాఖకు నివేదిక పంపించింది. అనుమతి రాగానే న్యాయస్థానానికి నివేదించి, ఆయా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.
దేవికారాణి విదేశీ విహారాలపై ఈడీ కన్ను
రూ.వందల కోట్ల కుంభకోణం కావడంతో మనీలాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇప్పటికే దర్యాప్తు ఆరంభించింది. కుంభకోణంలో దేవికారాణి పాత్రపై ఇప్పటికే అనిశా నుంచి సమాచారం సేకరించింది. ఆమె పలుమార్లు విదేశీయానం చేసినట్లు అనిశా దర్యాప్తులో తేలింది. అమెరికా, యూరప్ ఖండాల్లోని పలు దేశాలతోపాటు ఈజిప్ట్, చైనా సహా 23 దేశాలకు ఆమె వెళ్లివచ్చినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి.
కాక్స్ అండ్ కింగ్స్, థామస్ కుక్, సాట్క్ అండ్ కింగ్స్‌తోపాటు మరో టూర్ ఆపరేటర్ ద్వారా ఈ పర్యటనలు సాగించినట్లు గుర్తించారు. ఆ సమారారం ఆధారంగా ఆమె విదేశాల్లో ఏమైనా పెట్టుబడులు పెట్టారా? అని ఆరా తీయడంపై ఈడీ దృష్టి సారించింది. ‘ఇప్పటికే ఈడీ అడిగిన సమాచారం అందజేశాం. మనీలాండరింగ్ జరిగిందా? లేదా? అనేది ఈడీ దర్యాప్తులో తేలుతుంది’ అని అనిశాలోని ఓ కీలక అధికారి వెల్లడించారు. దేవికారాణి భర్త గురుమూర్తి గతంలో లిబియాలో వైద్యుడిగా పనిచేశారు. దేవికారాణి అక్కడికి పలు విడతలుగా వెళ్లినట్లు తేలడంతో ఈడీ దర్యాప్తునకు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవీచూడండి : ఈఎస్‌ఐ కుంభకోణం: నిందితులను ఈ నెల 18 వరకు రిమాండ్