Satyavathi Rathod: కొత్త కొత్త వైరస్లు ప్రబలుతున్న క్రమంలో ప్రకృతి వైద్యం ప్రాధాన్యత పెరిగిందని... ఆదివాసీ, గిరిజన ప్రకృతి వైద్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ఆదివాసీ సంప్రదాయక వైద్య రీతులపై వర్చువల్ విధానంలో జరిగిన జాతీయ వర్క్ షాప్లో మంత్రి ప్రసంగించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందినా అడవుల్లో ఆదివాసీ, గిరిజన బిడ్డలు చేసే ప్రకృతి వైద్యానికి ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు.
దుష్పరిణామాలకు ఆస్కారం లేదు
కరోనా సమయంలో ప్రకృతి వైద్యం, ప్రాశస్త్యం మరింత పెరిగిందని... ఇలాంటి వైద్యాన్ని తగిన రీతిలో గుర్తించి, భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రకృతిలో దొరికే మూలికల ద్వారా జరిగే వైద్యం ద్వారా దుష్పరిణామాలకు ఆస్కారం లేదని... అందుకే దీనికి ఇప్పుడు ఆదరణ బాగా పెరుగుతోందని అన్నారు. అడవుల్లో దొరికే అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి, ప్రమాదం వచ్చినప్పుడు ప్రకృతి వైద్యం పొందడం వల్ల మంచి జీవన ప్రమాణాలతో వందేళ్లకు పైగా జీవించారని చెప్పారు.
ఆ దిశగా పరిశోధన చేయాలి
ప్రకృతి ఆహార విధానాన్ని, వైద్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న మంత్రి... ఆ దిశగా మరింత పరిశోధన చేయాలని సూచించారు. స్థానిక యువతకు అవగాహన కల్పించి సంరక్షించాలని అన్నారు. కొత్త రోగాలు, జబ్బులు వస్తున్న నేపథ్యంలో ఆదివాసీ, గిరిజన వైద్యం ద్వారా అవి నయమవుతాయా లేదా అన్న విషయంపై అధ్యయనాలు చేయాలని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ ప్రోత్సాహం అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు.
ఇదీ చదవండి : మేడారం జాతర ఈసారి ప్రత్యేకం.. షిఫ్ట్వైజ్ దర్శనాలు, వీఐపీ పాసులు..