Illegal Construction Demolition : రాష్ట్రంలో నగరాలు, పురపాలక పట్టణాల్లో అక్రమ నిర్మాణాలు, నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాల తొలగింపు చర్యలు కొనసాగుతున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు 927 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్రమ నిర్మాణాలపై పురపాలక కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదులతో పాటు ఆన్‌లైన్, టీఎస్‌బీపాస్ వెబ్‌సైట్, ట్విటర్, మెయిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను పరిశీలించి అవి అందిన మూడు రోజుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు వివరించింది.
కఠిన చర్యలు..
Illegal Construction Demolition in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు గుర్తించి చర్యలు తీసుకునేందుకు జిల్లా టాస్క్‌ఫోర్సు బృందాలు చర్యలు చేపట్టినట్లు చెప్పింది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతుల్లో సత్వరం, సులభతరమైన విధానంగా అందుబాటులోకి తెచ్చిన టీఎస్‌బీపాస్‌ను తెచ్చిందని పేర్కొంటూ ఇదే సమయంలో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ నిర్మాణాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పురపాలకశాఖ అధికారులు స్పష్టం చేశారు.
15 రోజులకోసారి కూల్చివేత..
Telangana Municipal Ministry : రాష్ట్రంలో ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో 459, హెచ్‌ఎండీఏ పరిధిలోని పురపాలక సంఘాల్లో 468 అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేసినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్సు బృందాలు ప్రతి 15 రోజలకోసారి విస్తృతంగా పర్యటించి అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతకు చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేసే కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుందని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 141 జిల్లా టాస్క్‌ఫోర్సు కమిటీలు, 700 మంది సభ్యులతో నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నాయని అధికారులు వివరించారు. పురపాలక, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, రహదారులు, భవనాలశాఖ అధికారులతో ఈ కమిటీలు ఏర్పాటైనట్లు తెలిపారు.