రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రయాణికుల అవసరాలకు అనుకూలంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. పండుగకు ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా మరిన్ని బస్ సర్వీసులు పెంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో 70 శాతం మేర సర్వీసులు నడుపుతున్నారు. ఇక ముందు వీటిని వంద శాతానికి పెంచాలని తీర్మానించారు. మారుమూల ప్రాంతాలకూ బస్సులు వెళ్లేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
ప్రతి బస్సుల్లో ధరల పట్టిక ఏర్పాటు
ప్రైవేటు డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తుండడం ప్రభుత్వ దృష్టికి రావడం వల్ల బస్సుల్లో ధరల పట్టిక ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. నిర్ణీత ఛార్జీ కన్నా.. ఎక్కువ వసూలు చేసినవారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు 24 గంటలు పనిచేసే కంట్రోల్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
సంస్థకు గణనీయంగా తగ్గిన ఆదాయం
బస్సులు తిరుగుతున్నా ఆర్టీసీకి ఆశించిన మేర ఆదాయం రావట్లేదు. టిక్కెటింగ్ వ్యవస్ధ సక్రమంగా లేకపోవడం వల్ల సంస్ధకు వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోతోంది. వరంగల్ రీజియన్‌లో రోజుకు కోటి 20 లక్షల రూపాయల మేర ఆదాయం రావాల్సి ఉండగా...ప్రస్తుతం కనీసం 20 లక్షల రూపాయలు కూడా రావట్లేదు.
రద్దీకి అనుగుణంగా బస్సుల ప్రణాళిక
రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడం ఆర్టీసీ అధికారులకు సవాల్‌గా మారింది. ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ బస్సులు నడిపి ప్రయాణికుల ఇబ్బందులు తీర్చగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఉన్నతోద్యోగులారా.. సమ్మెలోకి రండి: ఆర్టీసీ కార్మికులు