స్కూళ్లూ, ఆఫీసులకు సెలవు కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఇల్లాలికి పని భారం కూడా పెరిగిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ కోరినవి వండి, అందించే క్రమంలో ఇల్లాలు విపరీతమైన ఒత్తిడికి గురవుతోంది. ఈ ఒత్తిడి ఎన్నో రకాల అనారోగ్యాలకూ దారితీస్తుంది.
ఇదంతా ఒకెత్తు. మరోవైపు మహిళలు గృహహింసకూ గురవుతున్నారు. కొన్ని వేలమంది మహిళలు హింసకు గురవుతున్న నేపథ్యంలో యూరప్‌లోని అనేక సేవా సంస్థలు బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించడానికి హోటళ్లు, ఇతర గృహాలను అందుబాటులో ఉంచాలని కోరుతున్నాయి.
అలాగే ఇంటి చుట్టుపక్కల వారిని కాస్తంత అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నాయి. సరకుల సంచిలో నుంచి చిన్న చీటీ జారిపడినా గమనించండి. అది గృహహింసకు గురవుతున్న ఓ మహిళ తనను కాపాడమని ఎంతో ఆవేదనతో చేసే అభ్యర్థన కావచ్చు అంటున్నారు అధికారులు. స్పెయిన్‌లో స్థానిక అధికారులు గృహహింసకు గురవుతున్న మహిళలను రక్షించడానికి చక్కని మార్గాన్ని కనిపెట్టారు.
బాధితురాలు నేరుగా మందుల షాప్‌కు వెళ్లి మాస్క్ 19 అని అడిగితే చాలు. ఆ షాప్ యజమాని వెంటనే సంబంధిత అధికారులకు సమాచారాన్ని అందిస్తాడు. ఈ కోడ్ భాష ఎందుకు.. నేరుగానే చెప్పొచ్చుగా అని మీరనుకోవచ్ఛు కానీ హింసకు గురవుతున్నాననే విషయాన్ని ఫోన్ చేసి చెప్పే అవకాశమూ ఉండటం లేదు. భాగస్వామి ఇంట్లోనే ఉండటం వల్ల ఆ అవకాశాన్నీ కోల్పోతున్నారట.
బ్రిటన్‌కు చెందిన రాచెల్ విలియమ్స్ ఒకప్పుడు గృహహింస బాధితురాలు. ప్రస్తుతం బాధితులకు ఆన్‌లైన్‌లో సహాయ, సహకారాలను అందిస్తుంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కొన్ని దేశాల్లో గృహహింస 30 శాతం వరకూ పెరిగిందంటున్నారు.