కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై బదిలీ వేటు పడింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా సర్ఫరాజ్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. శాసనసభ ఎన్నికల ఖర్చు విషయంలో భాజపా అభ్యర్థి బండి సంజయ్‌తో ఆయన ఫోన్లో మాట్లాడినట్లు వచ్చిన ఆడియో టేపులు సంచలనం రేకెత్తించాయి. తనకు వ్యతిరేకంగా కలెక్టర్ వ్యవహరించారని మంత్రి గంగుల కమలాకర్ అప్పట్లో ఆరోపించారు.
ఈ విషయంలో సీఎస్ జోషిని కలిసి సర్ఫరాజ్ వివరణ ఇచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్ ను బదిలీ చేసిన ప్రభుత్వం... ఎక్సైజ్ కమిషనర్‌గా నియమించింది. ఆయన స్థానంలో కరీంనగర్ కలెక్టర్‌గా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంకను బదిలీ చేసింది. జోగులాంబ గద్వాల కలెక్టర్‌గా వనపర్తి కలెక్టర్ శ్వేతా మహంతికి అదనపు బాధ్యతలు అప్పగించింది.
మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌ల పోస్టింగుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్యకార్యదర్శిగా బూసాని వెంకటేశ్వరరావును బదిలీ చేసింది. ఇంటర్ ఫలితాల వివాదం తర్వాత వెయిటింగ్లో ఉన్న అశోక్‌ను మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: త్వరలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాల ఏర్పాటు