ఇప్పటికే దేశంలో అత్యుత్తమంగా ఉన్న తెలంగాణ భవననిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. క్రెడాయ్, బిల్డర్స్ ఫెడరేషన్, స్థిరాస్తి, నిర్మాణ రంగ సంఘాల ప్రతినిధులు హైదరాబాద్లో మంత్రిని కలిశారు. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల విషయంలో పారదర్శక విధానాలకు శ్రీకారం చుట్టామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం మెత్తం ప్రక్రియను ఆన్లైన్ చేస్తూ మరింత పారదర్శకంగా ఉండే విధానాన్ని రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు.
కలిసి పనిచేద్దాం...
భవననిర్మాణ అనుమతులను మరింత సరళతరం చేసేందుకు అధికారులు చేస్తున్న కసరత్తు కోసం బిల్డర్ల సంఘాల నుంచి ఒకరిద్దరు ప్రతినిధులు కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న అనుమతుల విధానాలను పరిశీలించి అత్యుత్తమ విధానం కోసం సూచనలు చేయాలని కోరారు. అన్ని పురపాలక విభాగాల్లో ఇప్పటికే ఈ-ఆఫీస్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నామన్నారు. దీంతో అనుమతుల్లో జాప్యం అయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. స్థిరాస్తి రంగంలో దేశంలోనే హైదరాబాద్ నగరం వృద్ధి దిశలో కొనసాగుతోందని... వేలాది మందికి ఉపాది కల్పించే భవన నిర్మాణ, స్థిరాస్తి రంగాలకు ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశాం
నిర్మాణ వ్యర్థ్యాలను చెరువులు, ఖాళీ ప్రదేశాల్లో వేస్తే చర్యలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు. నగరంలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర టౌన్షిప్ విధాన ముసాయిదాను అన్ని నిర్మాణ సంఘాలకు అందిస్తామన్నారు. దానిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి నలుదిశలా విస్తరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని... ఇందుకు బిల్డర్లు సహకరించాలని కోరారు. పశ్చిమ హైదరాబాద్ నగరం ఇప్పటికే కంపెనీలతో నిండిపోవడంతో పాటు జనసాంద్రత పెరిగిన నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు కంపెనీలు వచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కేటీఆర్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలని కోరారు. స్థిరాస్తి, నిర్మాణ సంఘాలు సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో జీహెచ్ఎంసీతో కలిసి పనిచేయాలని సూచించారు.
ఇదీ చూడండి: మరో 8 లాజిస్టిక్ పార్కులు నిర్మిస్తాం: కేటీఆర్