శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా లండన్‌కు వెళ్లాలనుకునేవారు ఇకపై కేవలం తొమ్మిది గంటల్లోనే గమ్యస్థానాన్ని చేరుకుంటారు. ఇందుకోసం ఎయిర్ ఇండియా శుక్రవారం నుంచి నాన్‌స్టాస్ విమాన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి నేరుగా లండన్‌కు వారంలో రెండు రోజులు సోమ, శుక్రవారాల్లో ఈ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా నాన్‌స్టాప్ విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి కేవలం తొమ్మిది గంటల సమయంలోనే చేరుకుంటుందని ఎయిర్‌ఇండియా అధికారులు తెలిపారు. దీంతో చాలా కాలంగా నేరుగా విమాన రాకపోకల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల కల నెరవేరింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు సమీప రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు కూడా ఈ సేవలను ఉపయోగించుకునేందుకు అవకాశం ఏర్పడిందని ఎయిర్ ఇండియా సంస్థ అధికారులతోపాటు శంషాబాద్ జీఎంఆర్ విమానాశ్రయం అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇప్పటివరకు దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్, గోవా, అమృత్‌సర్ నగరాల నుంచే లండన్‌కు నేరుగా విమాన సర్వీసులు ఉండగా.. ఇకపై హైదరాబాద్ కూడా ఈ జాబితాలో చేరింది. బోయింగ్ 787 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా 256 సీట్లతో వారానికి రెండుసార్లు ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ఎయిరిండియా తెలిపింది. ఇందులో 18 బిజినెస్ క్లాసులు, 238 ఎకానమీ క్లాసులు ఉంటాయంది. భారత్-యూకే సెక్టార్ మధ్య విమానయాన సంబంధాలను ఇది మరింత బలోపేతం చేస్తుందని ఎయిరిండియా అభిప్రాయపడింది.
ఇవీ చూడండి: Baby Snake: గంటసేపు అందరినీ ఆగం చేసిన పాముపిల్ల.. చిక్కినట్టే చిక్కి..!