కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు పాటిస్తూ కొత్త విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నాయి. యూనిసెఫ్, ప్రముఖ సంఘాలు ఇప్పటికే రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం పలు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డు పరిధిలోని పాఠశాలలు మార్పులు, చేర్పులకు శ్రీకారం చుడుతున్నాయి.
కేంద్ర మానవ వనరుల శాఖ, ఆయా బోర్డులు తయారు చేసే మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నామని ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఇస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌రాజు చెప్పారు. పాఠశాలల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న దానిపై మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని, నివేదికను కేంద్ర మానవ వనరుల శాఖకు అందజేస్తామని జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) సంచాలకుడు సేనాపతి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11,500 ప్రైవేట్ పాఠశాలలు పనిచేస్తుండగా, రాజధాని పరిధిలోని మూడు జిల్లాల్లో దాదాపు 4 వేలు ఉన్నాయి.
ప్రధానంగా చేస్తున్న మార్పులు ఇవీ...
- సాధారణంగా తరగతి గదిలో 30-40 మంది విద్యార్థులు ఉంటారు. భౌతిక దూరం పాటించాలంటే షిఫ్టు విధానం అమలు చేయాలి. అంటే సగం మంది ఒక రోజు బడికి వస్తే మిగిలిన వారు ఇంటి వద్ద ఒకటీ రెండు పీరియడ్లు ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావాలి. లేదంటే తరగతిని రెండు సెక్షన్లు చేసి నిర్వహించాలి. అది సాధ్యమయ్యే పరిస్థితి లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి.
- ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్, కాలితో పెడల్‌ను తొక్కితే చేతిలో శానిటైజరు పడేలా పరికరాలు సిద్ధం చేస్తున్నారు.
- పాఠశాల కార్యాలయ గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.
- స్పోర్ట్స్ పీరియడ్‌లో ఆటలు కాకుండా భౌతిక దూరం పాటిస్తూ వ్యాయామాలు చేయించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
- షిఫ్టు విధానంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నందున బస్సుల్లో ఎవరు ఎక్కడ కూర్చోవాలో ముందుగానే సూచనలు చేయాలని భావిస్తున్నారు.