Telangana Rains Today : షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీగా వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్‌లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Hyderabad Rain Today : వారంపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వాన ఓ మూడ్రోజులు బ్రేక్ తీసుకుని మళ్లీ షురూ అయింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, ఎల్బీనగర్, చైతన్యపురి, వనస్థలిపురం, పనామా, అబ్దుల్లాపూర్‌మెట్, నాంపల్లి, సికింద్రాబాద్, చాంద్రాయణగుట్ట, పాతబస్తీ, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, చర్లపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్‌పల్లిలో వంటి పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది.
ఉదయం నుంచి వర్షం కురుస్తుండటం వల్ల బడులు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు రహదారులపైకి చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు వరద నీటిలోనే సతమతమైన లోతట్టు ప్రాంత వాసులు మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు.
నేడు, రేపు హైదరాబాద్ నగరానికి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంటనే రోడ్లపైకి రావొద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్లపైకి రాకుండా గంట తర్వాత రావాలని సూచించారు. భారీ వర్షాలతో నగరంలోని రోడ్లపైకి చేరిన నీరు బయటకు వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు. ఈ సూచనలు పాటించకపోతే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే అవకాశముంటుందని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో బీరంగూడ కూడలి సమీపంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రహదారుల పైకి నీరుచేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు అయితే కొన్ని చోట్ల నాళాలు మూసుకుపోవడంతో రహదారుల పైకి నీరు వచ్చి చేరుతుందని వాపోతున్నారు. గ్రేటర్ అధికారులు స్పందించి రహదారులపై చేరుకున్న నీటిని వెంటనే తొలగించాలని కోరారు.
నిర్మల్ జిల్లా భైంసా మండలం పార్డి బి, చాత గ్రామాల్లో చిన్నపాటి వర్షాలకు వరద ఉద్ధృతి ఎక్కువై.. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వర్షం వల్ల ఇక్కడి వాగులో ప్రవాహం పెరుగుతోంది. అయినా కొంతమంది ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు. ఈ ప్రయత్నంలో వాగులో పడి గల్లంతవుతున్నారు. శుక్రవారం రోజున ఓ చిరు వ్యాపారి ద్విచక్రవాహనంపై వాగు దాటడానికి ప్రయత్నించాడు. మధ్యలోకి వెళ్లేసరికి ప్రవాహ వేగం పెరగడంతో వాహనం ఆగిపోయి వాగులో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతణ్ని తాడు సాయంతో కాపాడారు. ఇలా కొందరు ఎంతచెప్పినా వినకుండా ప్రమాదానికి ఎదురెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు.