రాజధానిలో పార్కింగ్ సమస్య ప్రహాసనంగా మారింది. బయటకెళితే వాహనాన్ని ఎక్కడ నిలపాలో తెలియదు. వెంటనే వచ్చేద్దామని దుకాణంలోకి వెళ్లి వచ్చేలోగా చలానా వచ్చేస్తోంది. సమస్యను అధిగమించడానికి బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాలను ఏర్పాటు చేస్తామని చెప్పిన జీహెచ్‌ఎంసీ విఫలమైంది. పాతబస్తీలో ఒక నిర్మాణానికి టెండర్లు పిలిచినా గుత్తేదారు ముందుకు రాలేదు. పోలీసులు సైతం, ఖాళీ స్థలాల్లో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ఏడాది కిందట ప్రకటించినా సఫలీకృతులు కాలేకపోయారు.
భాగ్యనగరంలో ప్రస్తుతం 70 లక్షల వాహనాలున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలను పరిగణలోకి తీసుకుంటే నగర రోడ్లపై రోజూ 50 లక్షల వాహనాలు తిరుగుతాయని అంచనా. ఈమేరకు ప్రధాన రహదారుల విస్తరణ చేయకపోవడంతో రోజూ ఏదో ఒకచోట ట్రాఫిక్ స్తంభిస్తోంది. గంటలో చేరాల్సిన గమ్యస్థానానికి రెండు గంటలు పడుతోంది. ఆ సమయమంతా కాలుష్యంతో ఉండిపోవాల్సి వస్తోంది. వీటికితోడు పార్కింగ్ పెద్ద సమస్యగా పరిణమించింది. ప్రధాన రోడ్లలో ఎక్కడా 200 కార్లను నిలిపే సౌకర్యం లేదు. చాలా మంది కార్లను అడ్డదిడ్డంగా ఆపేస్తుండడం ట్రాఫిక్ సమస్యలకు దారితీస్తోంది.
కేటీఆర్ ఆదేశించినా..
నగరంలో 25 ప్రాంతాల్లో బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రెండేళ్ల కిందటే ఆదేశించారు. మొదటి దశలో పాతబస్తీ సహా 10 చోట్ల కొన్ని స్థలాలను ఎంపిక చేశారు. పాతబస్తీలో బీవోటీ ప్రాతిపదికన సముదాయం నిర్మించడానికి టెండర్లు పిలిచారు. ప్రభుత్వం పెట్టిన నిబంధన వల్ల నిర్మాణం తమకు గిట్టుబాటు కాదంటూ గుత్తేదారులు టెండర్లు దాఖలు చేయడానికి నిరాకరించారు. రెండోసారి టెండర్లు పిలిచినా అదే పరిస్థితి. పోనీ నగరంలోని ఇతర ప్రాంతాల్లోనైనా నిర్మించారా అంటే.. పాతబస్తీలో స్పందన రాకపోవడంతో ఏడాది కాలంగా ఈ విషయాన్నే అటకెక్కించేశారు. నాంపల్లి వద్ద తమకు సర్కారిచ్చిన స్థలంలో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి ఎల్‌అండ్‌టీ మెట్రో ముందుకొచ్చినా.. నిర్మాణం మొదలు కాలేదు.
పోలీసులు అలా..
నగరంలో పార్కింగ్ ఇబ్బందులను అధిగమించడానికి నగర పోలీసు శాఖ సరికొత్త పరిష్కారం కనుగొన్నట్లు ఏడాది కిందట ప్రకటించింది. 1200 చోట్ల ఖాళీ స్థలాలను గుర్తించి లక్ష వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఎక్కడెక్కడ పార్కింగ్ సదుపాయం ఉందో తెలిపేలా ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని భావించింది. ఇది కార్యరూపం దాలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని వాహనదారులు చాలా ఆశలు పెట్టుకున్నారు. పోలీసులు ప్రకటనకే పరిమితమయ్యారు. దీర్ఘకాలంగా ఉన్న పార్కింగ్ సమస్య అపరిష్కృతంగానే ఉండిపోయింది. భాగ్యనగరవాసులు పార్కింగ్ భాగ్యానికి నోచుకోలేదు. మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికైనా వాహనాలు నిలిపేందుకు సముదాయాలను నిర్మించాలని కోరుతున్నారు.
ఇవీచూడండి: ఎందుకీ తొందర: నిమిషం ఆగితే ఐదుగురు ప్రాణాలు నిలిచేవి