లాక్‌డౌన్ సమయంలో పోలీసు వ్యవస్థ చేస్తున్న సేవలకు లభించిన గౌరవం, గత వందేళ్లలో ఎప్పుడూ లభించలేదని... ఇది గర్వించదగ్గ విషయమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారితో పోలీసులు పోరాటం చేస్తున్నారని తెలిపారు. కరోనాను ఎదుర్కొంటూనే కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉందని గుర్తు చేశారు. మనోనిబ్బరంతోనే కొవిడ్‌ను జయించగలమని సిబ్బందికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం కరోనా విషయంలో అందరిలో అవగాహన ఏర్పడిందన్నారు.
విపత్కర పరిస్థితుల్లోనూ మహిళా పోలీసులు కూడా రోడ్లపై ఉంటూ విధులు నిర్వహిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు. నాడు మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడిన పోలీసులు.. నేడు మహమ్మారి కరోనాతోనూ పోరాడుతున్నారని తెలిపారు. కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నవారు ప్లాస్మాను దానం చేసి ఇతరులకు ప్రాణాలను కాపాడాలని కోరారు. కరోనా వైరస్ సోకిన పోలీసు సిబ్బంది బాధ్యత ఆయా స్టేషన్ అధికారులదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కరోనా నుంచి కోలుకున్న 220 మంది పోలీసులు... తిరిగి విధుల్లో చేరిన సందర్భంగా సీపీ వారికి బహుమతులు అందజేశారు.
ఇవీ చూడండి: పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం ఉంటుంది: హైకోర్టు