నిందితులను అరెస్ట్ చేసిన 90రోజుల్లోపు అభియోగపత్రాలు సమర్పించాలన్న నిబంధన మేరకు ఈ నెల 10లోపు నాంపల్లి కోర్టులో వీరిపై ఛార్జీషీటును దాఖలు చేయనున్నారు. యాన్‌హువో, ధీరజ్ సర్కార్, అంకిత్‌కపూర్‌లను ప్రధాన నిందితులుగా పేర్కొననున్నారు. డోకిపే, లింక్‌యున్ కంపెనీల ద్వారా కేమెన్ ద్వీపంలోని రెండు, మూడు బ్యాంకు ఖాతాల్లో రూ.110 కోట్ల నల్లధనాన్ని డిపాజిట్ చేసిన ఆధారాలను సమర్పించనున్నారు.
డొల్ల కంపెనీల నుంచి నగదు
చైనా సంస్థలకు ఛార్టెడ్ అకౌంటెంట్‌గా వ్యవహారించిన దిల్లీ వాసి హేమంత్‌కు సైబర్ క్రైమ్ పోలీసులు తాఖీదులు పంపించారు. డోకీపే, లింక్‌యున్ కంపెనీలతో పాటు మరో 30 కంపెనీలు నిర్వహించిన అక్రమ లావాదేవీలపై సమాధానాలివ్వాల్సిందిగా తాఖీదుల్లో కోరారు. చైనా సంస్థల నుంచి ఆయన బ్యాంక్ ఖాతాల్లో రూ.6కోట్లు జమైనట్టు గుర్తించారు.
ఖాతాలు స్తంభింపజేశారు
రంగులు చెప్పండి.. లక్షలు గెలుచుకోండి అంటూ మాయాజాలం ప్రదర్శించి వందల కోట్లు పోగేసుకున్నా చైనా కంపెనీల ఖాతాల్లో రూ.70కోట్లకుపైగా నగదును సైబర్ క్రైమ్ పోలీసులు స్తంభింపజేశారు. ఈ నగదుకు లెక్కాజమా లేకపోవడం వల్ల హవాలా సొమ్ముగా భావించిన పోలీసులు... బ్యాంకు అధికారులకు అధికారికంగా లేఖలు రాశారు. తాము సూచించే వరకూ ఆయా ఖాతాల అంతర్జాల ఆధారిత లావాదేవీలనూ అనుమతించవద్దని కోరారు. ఈ అక్రమాలను ఐటీ, ఈడీలకు సైబర్‌క్రైమ్ పోలీసులు సమాచారం ఇవ్వడం వల్ల ఆయా శాఖలు ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారంపై సమాంతరంగా దర్యాప్తు చేస్తున్నాయి.