హైదరాబాద్‌కు ఐకాన్‌గా మారిన దుర్గం చెరువు తీగల వంతెనకు సందర్శకుల తాకిడి నానాటికీ పెరుగుతోంది. వంతెనపై వాహనాలు ఆపి ఫోటోలు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఫలితంగా ప్రమాదాలు పెరుగుతుండడం, రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చలాన్ల మోత మోగిస్తున్నారు.
సెప్టెంబర్ 25న మొదలైన ఈ తీగల వంతెనపై ప్రమాదకర రీతిలో వాహనాలు నిలిపిన వారిపై ఇప్పటివరకు 3వేల38 కేసులు నమోదు చేశారు. సాంకేతికత సాయంతో సీసీటీవీ కెమెరాల నిఘాతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ-చలాన్లు విధిస్తున్నారు. వాహనదారులు చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్లను కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలాంటి వారికి పోలీసులు మరిన్ని జరిమానాలు విధిస్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే చాలా వరకూ ఈ తరహా కేసులు తగ్గాయని పోలీసులు చెబుతున్నారు.
సైబరాబాద్ పోలీసుల ముందస్తు జాగ్రత్తల కారణంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇందుకోసం పూర్తిస్థాయి సాంకేతికతను పోలీసులు వాడుతున్నారు. అత్యాధునిక హైరిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు, సెంట్రలైజ్‌డ్ ఐపీ బేస్డ్ పబ్లిక్ ఎనౌన్స్‌మెంట్ సిస్టమ్, వంతెనకు ఇరు వైపులా 13 మైకులు... వీటంన్నింటిని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. దీంతో పాటు షిప్ట్‌ల వారిగా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసుల నిఘాను ఏర్పాటు చేశారు. ఏదైనా వాహనం తీగల వంతెనపై ఆగితే ముందు కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని సిబ్బంది సీసీటీవీ ద్వారా గమనిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తారు.
హెచ్చరికలు విని కూడా వాహనాలు తీయకపోయినా... నంబర్ ప్లేటును కనిపించకుండా చేసి ఫోటోలు దిగేందుకు ప్రయత్నించినా.. ఆటోమేటిక్‌గా చలాన్లు విధించేలా ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నారు.