Huts demolition in ghmc: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆరో వార్డులోని బోయిన్‌పల్లి మార్కెట్ సమీపంలో నల్ల పోచమ్మ దేవాలయం పక్కనే ఉన్న తమ గుడిసెలను అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా గత 30 ఏళ్లుగా నివాసముంటున్న తమ గుడిసెలు ఏ విధంగా కూల్చివేశారంటూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. అదేవిధంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తన అనుచరులే గుడిసెలను కూల్చివేసేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని బాధితులు తెలిపారు.
న్యాయం చేయాలంటూ...
ఇంట్లో ఉన్న సామాగ్రిని బయటకు తీసుకునేంత వరకు ఆగకుండా అధికారులు ఉదయాన్నే కూల్చివేతను చేపట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న గుడిసెలను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేసి.. తమ బ్రతుకును రోడ్డు పాలు చేశారని వాపోయారు. వెంటనే తమకు న్యాయం చేయాలంటూ విష్ణు అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఘటనా స్థలికి చేరుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న వారికి సర్ది చెప్పారు.
ఇదీ చదవండి:మీ బండిపై చలాన్ ఉందా.? అయితే త్వరపడండి.. ఈ లిమిటెడ్ ఆఫర్ మీకోసమే..!