రాష్ట్రంలో వ్యాక్సినేషన్(Corona Vaccination in Telangana) వేగంగా కొనసాగుతున్నా.. కొన్ని జిల్లాల్లో ఇంకా 60 శాతం మందికి టీకాలు అందలేదు. వ్యాక్సిన్ పంపిణీలో 98 శాతంతో హైదరాబాద్ తొలిస్థానంలో ఉండగా... 95 శాతంతో రంగారెడ్డి జిల్లా రెండోస్థానంలో ఉంది. ఆ రెండు జిల్లాల్లో మాత్రమే 90 శాతంపైగా మందికి తొలి డోస్ వ్యాక్సినేషన్ పూర్తైంది.
75% మందికి తొలిడోస్..
రాజన్న సిరిసిల్ల, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో 80 శాతానికిపైగా తొలిడోస్ ఇచ్చారు. ఇక 12 జిల్లాల్లో 70 శాతానికిపైగా.... మరో 12 జిల్లాల్లో 60 శాతానికి పైగా పూర్తైందని అధికారులు తెలిపారు. ఐతే వరంగల్, నల్గొండ, జోగులాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో మాత్రం నేటికీ..... 60 శాతం మందికి టీకా అందలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 75శాతం మందికి ఒక డోస్ అందించగా మరో 25శాతం మందికి ఒకట్రెండు నెలల్లో ఇవ్వాల్సి ఉంది.
రెండో డోసుకు ఊసేది..
తెలంగాణలో తొలిడోస్(Corona Vaccination first dose in Telangana)కు ఇచ్చిన ప్రాధాన్యం రెండోడోసుకు ఇవ్వట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీకాకేంద్రాల్లో రోజుకి 100 నుంచి రెండువందల మందికి వ్యాక్సిన్ ఇస్తుండగా..అందులో మూడొంతులకు పైగా తొలిడోసే ఇస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో తొలిడోస్ తీసుకున్న వారిలో కేవలం 39శాతంమందికే రెండోడోస్ అందించారు. మరో 61 శాతం మందికి రెండోడోస్(Corona Vaccination second dose in Telangana) ఇవ్వాల్సిఉండగా.. అందులో ఇప్పటికే 25 లక్షల మందికి పైగా గడువు ముగిసినట్లు వైద్యశాఖ పేర్కొంది.
అగ్రస్థానంలో మేడ్చల్..
రెండో డోస్(Corona Vaccination second dose in Telangana) విషయంలో మేడ్చల్ జిల్లా 56 శాతంతో అగ్రస్థానంలో నిలవగా.... 54 శాతంతో హైదరాబాద్ రెండో స్థానంలో, 51 శాతంతో రంగారెడ్డి మూడోస్థానంలో ఉన్నాయి. నారాయణపేట, కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో రెండ్‌డోస్ వ్యాక్సినేషన్ 20 శాతానికి మించలేదు. ఇక రెండోవిడత వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని భావిస్తున్న భావిస్తున్న ప్రభుత్వం.. ఒకట్రెండు నెలల్లో వందశాతం పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తోంది.
- ఇదీ చదవండి : వందకోట్ల డోసులు.. సంఖ్య కాదు- దేశ సంకల్ప బలం: మోదీ