ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. హైదరాబాద్‌లో జంట జలాశయాలైన హిమాయత్, ఉస్మాన్ సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్‌సాగర్ జలాశయంలోకి 2,570 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. హిమాయత్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,762.40 అడుగులు నీటి మట్టం ఉంది.
ఉస్మాన్‌సాగర్ జలాశయంలోకి 3,055 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1787.35 అడుగులకు చేరింది.
రానున్న రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందన్న హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ఉద్ధృతిని పర్యవేక్షిస్తున్నారు.
గతనెల కూడా భారీవర్షాలకు హైదరాబాద్ జంట జలశయాలకు భారీగా వరద వచ్చింది. దీంతో ఉస్మాన్‌సాగర్ 2 గేట్ల ద్వారా 100 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడిచిపెట్టారు. హిమాయత్‌సాగర్ వద్ద మొత్తం ఏడు గేట్లు ఎత్తి నీటిని విడిచిపెట్టారు. జలమండలి సిబ్బందిని అప్రమత్తం చేసిన ఎండీ దానకిశోర్.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తాజాగా ఇన్ ఫ్లో పెరగడంతో... రేపో, మాపో అధికారులు నీటిని దిగువకు విడుదల చేయక తప్పదు.
మొత్తం మీద జంట జలాశయాల జలకళతో అటు అధికారులు ఇటు ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలాశయాల అందాలను చూసేందుకు తరలివస్తున్నారు.
ఇదీచూడండి: WEATHER REPORT: రాష్ట్రంలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం