హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో... జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శనకు సందర్శకులు తరలివస్తున్నారు. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు జరగనున్న 10వ గ్రాండ్ నర్సరీ మేళాకు... తొలిరోజు నుంచే సందర్శకులు పోటెత్తుతున్నారు. నగరం నడిబొడ్డున సాగర తీరాన ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో.... ఎటు చూసినా అందమైన పూలు, పచ్చటి మొక్కలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. తెలంగాణ, ఏపీ సహా... ఇతర రాష్ట్రాల నుంచి పేరుగాంచిన కంపెనీలు, అంకుర సంస్థలు, వ్యాపారులకు చెందిన 135 పైగా స్టాళ్లు కొలువుదీరాయి. వివిధ రకాల మొక్కలతోపాటు విత్తనాలు, సేంద్రీయ ఎరువులు, కుండీలు ఇలా... నగర సేద్యానికి సంబంధించిన ప్రతిఒక్కటీ ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంది. వందల రకాల మొక్కలు ఒకే చోట దొరుకుతున్నాయని సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అంకురాలతో అద్భుతాలు..
కొన్ని అంకుర సంస్థలు ప్రత్యేక చొరవ తీసుకుని.... ఇంటి పంటలకు సంబంధించిన ఆధునిక సాంకేతికతతో కూడిన నమూనాలు ప్రదర్శిస్తున్నాయి. నగర సేద్యంలో అభివృద్ధి చెందిన ఓ నమూనా హైడ్రోపొనిక్స్ విధానం. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల్లో అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీపై... ఇప్పటికే జిల్లా స్థాయిల్లో ఇన్సిఫినిటీ గ్రీన్‌ఫామ్స్ సంస్థ రైతులకు అవగాహన కల్పిస్తోంది.
వామనజాతి మొక్కల వయ్యారాలు..
కార్యాలయాలకు కొత్త అందాలు తెచ్చిపెట్టే బోన్సాయ్ మొక్కలు ప్రదర్శనలో కనువిందు చేస్తున్నాయి. విదేశీ జాతుల మొక్కలు, చేతివృత్తుల కళారూపాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చిరుధాన్యాలు, తినుబండారాలు, డ్రైఫ్రూట్స్ నర్సరీ మేళాలో విక్రయిస్తున్నారు. రుతికా ఇన్నోవేషన్ స్టాటప్ తేనె, ఇతర ఉత్పత్తులు విక్రయిస్తూ... తేనెటీగల పెంపకంపై అవగాహన కల్పిస్తోంది.
తక్కువ స్థలంలో సొంతంగా పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ ఉత్పత్తి చేసుకోవడానికి వినూత్న పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, మెళకులు తెలుకునేందుకు సందర్శకులు అత్యంత శ్రద్ధ చూపుతున్నారు. ఈ సారి ప్రదర్శనకు అద్భుత స్పందన లభిస్తోందని తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఛైర్మన్ తెలిపారు.
మరో నాలుగు రోజులపాటు జరగనున్న ఈ ప్రదర్శనకు వారాంతంలో సందర్శకుల తాగిడి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి:
Grand Nursery Mela 2021: హైదరాాబాద్‌లో జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన